మెరిట్ జాబితా ఇచ్చిన్రు..  అపాయింట్మెంట్ లెటర్స్ ఆపిన్రు

మెరిట్ జాబితా ఇచ్చిన్రు..   అపాయింట్మెంట్ లెటర్స్ ఆపిన్రు

 

  • కోర్టుల్లో ఆగిన పోస్టులపై కౌంటర్​ వేస్తలే..  
  • క్లియరెన్స్​ వచ్చిన వాటినీ నింపలే
  •  616 పీఈటీ, 369 ఫార్మసిస్టు పోస్టులతో పాటు 
  • పలు నియామకాలు పెండింగ్ లోనే 
  • 535 ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీలోనూ ఇదే తీరు
  • 1998  డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు 
  • 20 ఏండ్లయినా జరగని న్యాయం 
  •     ఏండ్ల తరబడి వేలాది మంది ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర  సర్కార్ నిర్లక్ష్యం, నాన్చుడు ధోరణితో సుమారు రెండున్నర వేల పోస్టుల భర్తీ ముందుకు సాగుతలేదు. కోర్టు విచారణలో ఉన్న కేసులపై సర్కార్ కౌంటర్ దాఖలు చేయకపోవడం, కోర్టు ఆదేశించినప్పటికీ కొన్ని పోస్టుల భర్తీలో నిర్ణయం తీసుకోకపోవడం క్వాలిఫైడ్​ అభ్యర్థులకు శాపంగా మారింది. ఎగ్జామ్​ రాసి, అర్హత సాధించి ఏండ్లవుతున్నా ఉద్యోగం రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయని కారణంగా 369 ఫార్మసిస్టు పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోగా, హైకోర్టు ఆదేశించినప్పటికీ 616 పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్ ముందుకు సాగడం లేదు. అర్హులు లేరనే కారణంతో 535 ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీని సర్కార్ పక్కనపెట్టేసింది.  

ఫార్మసిస్టు పోస్టుల భర్తీ ఆగిపోయి నాలుగేండ్లాయె

సర్కార్ దవాఖాన్లలోని 369 ఫార్మసిస్ట్‌‌‌‌ ఉద్యోగాలకు 2018 జనవరి నెలలో టీఎస్‌‌‌‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 12 వేల మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్‌‌‌‌లో రాతపరీక్ష నిర్వహించి, మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని వారు కూడా మెరిట్​ లిస్ట్​లో ఉండడంతో వివాదం చెలరేగింది. దీనిపై టీఎస్‌‌‌‌పీఎస్సీ ఓ వివరణ ఇచ్చింది. వీరంతా ప్రభుత్వ దవాఖాన్లలో కాంట్రాక్ట్ బేసిస్‌‌‌‌పై పనిచేస్తున్న ఫార్మసిస్టులు అని, వీరికి సర్వీస్‌‌‌‌  వెయిటేజీ కింద 45 మార్కులు (30 పాయింట్లు) కలిపామని పేర్కొంది. కనీస అర్హత మార్కులు సాధించని వారికి, ఏకంగా 45 మార్కులు కలిపి మెరిట్ లిస్ట్ లోకి తేవడంపై నిరుద్యోగులు కోర్టులో కేసులు వేశారు. నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారం కనీస అర్హత మార్కులు సాధించిన వారికే వెయిటేజీ ఇవ్వాలని ఒక కేసు, వెయిటేజీ మార్కులను తగ్గించాలని మరో కేసు వేశారు. వెయిటేజీ మార్కుల విషయంలో ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలు విన్న కోర్టు.. 2020 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో వెయిటేజీ మార్కులను 45 నుంచి 30కి తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేసేందుకు నిరాకరించిన సర్కార్.. పాత పద్ధతి ప్రకారమే మెరిట్ లిస్ట్ ను కొనసాగించింది. దీంతో కనీస అర్హత మార్కుల కేసు ఇప్పటికీ కోర్టులో అలాగే కొనసాగుతున్నది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న టీఎస్‌‌‌‌పీఎస్సీ, హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పటివరకూ కౌంటర్ దాఖలు చేయలేదు. కోర్టులో విచారణ ఉన్న ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తూ వాయిదా కోరుతున్నారు. దీంతో ఆ కేసు ఎటూ తెగకుండా అలాగే ఉండిపోయింది. 

హైకోర్టు ఆదేశించినా భర్తీ కానీ పీఈటీ పోస్టులు 

రాష్ట్రంలోని ఐదు సంక్షేమ శాఖల గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017 ఏప్రిల్ 14న టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో 83 పోస్టులు, సోషల్ వెల్ఫేర్​లో 182, బీసీ వెల్ఫేర్​లో 135, మైనార్టీ వెల్ఫేర్​లో 194, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీఆర్ఈఐఎస్ లో 22 పోస్టులున్నాయి. మొత్తం 15 వేల వరకు అప్లికేషన్లు రాగా, అదే ఏడాది సెప్టెంబర్​లో జరిగిన రాత పరీక్షకు సుమారు 11 వేల మంది హాజరయ్యారు. 2018 మే12న టీఎస్​పీఎస్సీ 1:2 రేషియోలో 1,200 మందితో మెరిట్ లిస్టు ప్రకటించింది. 2018 మే 18 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించింది. కానీ కొందరు డిప్లొమా అభ్యర్థులు కోర్టుకు పోవడంతో ఈ ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే నోటిఫికేషన్​లో  పేర్కొన్న 616 పోస్టులను ఎన్సీఈఆర్టీ రూల్స్​ ప్రకారం భర్తీ చేయాలని గత ఏడాది టీఎస్​పీఎస్సీని హైకోర్టు  ఆదేశించింది. 1 నుంచి 8వ తరగతి వరకు, 9 నుంచి 10 తరగతి వరకు రెండు కేటగిరీల పోస్టుల భర్తీకి కావాల్సిన అర్హతలున్న వారిని గుర్తించాలని, అందుకు తగ్గట్టుగా ఆ రెండు కేటగిరీలకు ఎన్ని పోస్టులు కావాలో నిర్ణయించాలని సూచించింది. ఆ తర్వాతే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే మొత్తం పోస్టుల్లో బీపీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు 26 పోస్టులు మాత్రమే ఉన్నాయని అధికారులు లెక్కతేల్చారు. ఏ లెక్కన 26 పోస్టులు ప్రకటించారో, ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని బీపీఈడీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.  

మెరిట్ జాబితా ఇచ్చిన్రు.. అపాయింట్మెంట్ లెటర్స్ ఆపిన్రు
సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో 704 పోస్టుల భర్తీకి 2019లో నవంబర్ లో నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో మేనేజ్‌‌‌‌మెంట్ ఇన్ఫ్‌‌‌‌ర్మేషన్ సిస్టం(ఎంఐఎస్), ఎంఆర్పీ విభాగంలో కో ఆర్డినేటర్ పోస్టులు, డీఈవో ఆఫీసుల్లో, డీపీవో ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, సిస్టం అనలిస్ట్ పోస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించారు. 2020 జనవరిలో జిల్లాలవారీగా మెరిట్ జాబితాను కూడా ప్రకటించారు. కాని ఎంపికైన  వారికి  నియామక పత్రాలు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే.. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు పలుమార్లు విద్యాశాఖ అధికారులను సంప్రదించడంతో ఈ నెల 19లోపు నియామక పత్రాలు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ డైరెక్టర్ ప్రత్యేక సర్క్యులర్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ప్రక్రియను ప్రారంభించలేదు.

స్వరాష్ట్రంలోనూ నెరవేరని డీఎస్సీ–98 అభ్యర్థుల కల 

1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే కటాఫ్​ మార్కుల విషయంలో రెండు జీవోలు జారీ చేయడంతో వివాదం మొదలైంది. ఇంటర్వ్యూల తర్వాత ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదు. దీంతో వీరంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌‌‌‌ను ఆశ్రయించారు. వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2009లో ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది. 2011లో హైకోర్టు కూడా ట్రిబ్యునల్​ తీర్పును సమర్థించింది. కానీ అప్పటి ప్రభుత్వం వారికి న్యాయం చేయలేదు. వాళ్లకు స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగలేదు. 48 గంటల్లో న్యాయం చేస్తామని 2015లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏడేండ్లయినా నెరవేరలేదు.

అర్హుల్లేరని ఆపేసిన్రు

రాష్ట్రంలో 1,215 ఉర్దూ టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 900 పోస్టుల భర్తీకి 2015లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 365 పోస్టులను మాత్రమే అధికారులు భర్తీ చేశారు. అర్హులు లేరని 535 పోస్టుల భర్తీని పక్కనపెట్టేశారు. 42 పీఈటీ పోస్టులు ఉంటే 4 పోస్టులను భర్తీ చేశారు. దీంతో చాలా ఉర్దూ స్కూళ్లు ఒకరిద్దరు టీచర్లతోనే నడుస్తున్నాయి. టీఆర్టీ – 2017 రాసిన మెరిట్ అభ్యర్థులతో మిగతా పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు అనేకసార్లు కోరారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్22 (2) ప్రకారం వివిధ కేటగిరీల పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చి భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు.  

కౌంటర్ వేస్తలేరు

పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 616 పోస్టులకు బీపీఈడీ అభ్యర్థులు అర్హులేనని ప్రకటించింది. తీరా రిజల్ట్స్ ఇచ్చి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక 26 పోస్టులకే మేం అర్హులమని తేల్చింది. ఏడాది క్రితమే దీనిపై బీపీఈడీ అభ్యర్థులం హైకోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. దీనికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా ఏడాదిగా వాయిదా కోరుతూ వస్తున్నది. మాకు న్యాయం చేయాలని అధికారులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నం. కానీ పట్టించుకోవడం లేదు. 
- కనకదుర్గ, కోదాడ, టీఆర్టీ పీఈటీ అభ్యర్థి