గోదావరి మిగులు జలాలు తేల్చండి

గోదావరి మిగులు జలాలు తేల్చండి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గోదావరిలో మిగులు జలాలెన్నో తేల్చిన తర్వాతే రివర్‌‌‌‌ లింకింగ్ ప్రాజెక్టు చేపట్టాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. అలాగే సదరన్‌‌‌‌ జోనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ ఎజెండా నుంచి రివర్‌‌‌‌ లింకింగ్‌‌‌‌ అంశాన్ని తొలగించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరిగేషన్‌‌‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌‌‌‌ సింగ్‌‌‌‌కు మంగళవారం లేఖ రాశారు. గోదావరి నదిలో తెలంగాణకు 968, ఏపీకి 324, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు 247 టీఎంసీల నికర జలాల వాటా పోను ఇంకెన్ని మిగులు జలాల లభ్యత ఉందో ముందు తేల్చాలని కోరారు. కాగా, ఇటీవల నిర్వహించిన కేంద్ర జలశక్తి శాఖ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ కమిటీ భేటీలో తమిళనాడు ప్రభుత్వం గోదావరి - కావేరి నదుల అనుసంధాన్ని సదరన్‌‌‌‌ జోనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎజెండాలో చేర్చాలని కోరింది. ఆ మేరకు త్వరలోనే నిర్వహించే సదరన్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ ఏజెండాలో ఈ అంశాన్ని చేర్చనున్నట్టు కేంద్రం సమాచారం ఇచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి అధ్యక్షుడుగా ఉండే సదరన్‌‌‌‌ జోనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌లో అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. నదుల అనుసంధానం వీలైనంత త్వరగా చేపట్టాలని కోరుతూ తమిళనాడు కేంద్రంపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకువస్తోంది.

హైడ్రాలజీ సర్వే చేయాలె

గోదావరిలో మిగులు జలాలపై హైడ్రాలజీ సర్వే చేయాలని, అన్ని రాష్ట్రాల కేటాయింపులు పోను మిగులు జలాలు ఉన్నట్టు తేలితే ఆ నీటిని గోదావరి - కావేరి అనుసంధానికి ఉపయోగిస్తే తమకేమి అభ్యంతరం లేదని ఇది వరకే సమాచారం ఇచ్చినట్లు ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ స్పష్టం చేశారు. ఏపీ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాలు ఇదే తరహా విజ్ఞప్తి చేశాయని గుర్తు చేశారు. లింక్‌‌‌‌ ప్రాజెక్టు కోసం తెలంగాణలో పెద్ద ఎత్తున భూ సేకరణ చేయాల్సి ఉన్నందున నీటిని తరలించే కాల్వ పొడవునా సాగు, తాగునీటిని అందించేందుకు రివర్‌‌‌‌ లింకింగ్‌‌‌‌కు తీసుకునే నీటిలో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ ఇప్పటికే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి సంబంధించిన డీపీఆర్‌‌‌‌ రూపొందించి సభ్య రాష్ట్రాలకు పంపింది. దీనిపై తెలంగాణ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. వాటిని ఇంతవరకు ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ తీర్చలేదు.