ఏడేండ్లు గడిచినా ముందుకు సాగుతలే..

ఏడేండ్లు గడిచినా ముందుకు సాగుతలే..
  • డీపీఆర్ ల దగ్గరే ఆగిన బ్రిడ్జీలు
  • అప్పుడు రూ.70 కోట్లు.. ఇప్పుడు రూ.120 కోట్లు
  • పెరిగిన వ్యయంతో నిర్మాణం సాధ్యమా..?
  • పొలిటికల్ స్టంట్ అంటున్న ప్రతిపక్షాలు

 

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని అంతర్గాం, మంచిర్యాల జిల్లాల సరిహద్దులో ఉన్న గోదావరి నదిపై బ్రిడ్జి, పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా హన్మకొండ పోయే రోడ్​లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన ఆర్ఓబీలు డీపీఆర్​లు పూర్తి చేసుకొని ఏడేండ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. గతేడాది డిసెంబర్ లో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు బ్రిడ్జిల నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఇప్పటికి 8 నెలలైనా వాటి పనులు మాత్రం మొదలు కాలేదు. మరోవైపు అంతర్గాం, మంచిర్యాల మీదుగా మహారాష్ట్రను కలిపే జాతీయ రహదారిపై నిర్మించే బ్రిడ్జిని మరోసారి సర్కార్ పక్కన పెట్టింది.

పెద్దపల్లి ఆర్ఓబీ కన్​స్ట్రక్షన్ సాధ్యమేనా...?
పెద్దపల్లి ఆర్ఓబీ కన్స్ట్రక్షన్ కోసం గత కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి ఆర్ఓబీ ప్రపోజల్​ను మోడీ ప్రభుత్వం ఏడేండ్ల క్రితం రూ.70 కోట్లతో ఆమోదం తెలిపింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణంపై స్పందించకపోవడడంతో ఆగిపోయింది. ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎలాంటి టెండర్లు పిలువ లేదు. రెండో టర్మ్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో బ్రిడ్జి నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ చేశారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభించే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన రూ.70 కోట్లతో నిర్మాణం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పుడు కొత్తగా రూ.120 కోట్లతో సర్కార్ కొత్త ప్రతిపాదనలు ప్రకటించింది. దీనిపై టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.120 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం సాధ్యమవుతుందో లేదో అని కాంట్రాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సాయిల్ టెస్ట్ చేసి సాధ్యం కాదన్నరు..
గతంలో పెద్దపల్లి ఆర్ఓబీ నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ చేశారు. అనంతరం నిపుణులు నిర్మాణ వ్యవయం రూ.70 కోట్లు సరిపోదని చెప్పడంతో పనులు ఆగిపోయినట్లు చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి భూమి ఉపరితలం అనకూలంగా లేదని, ఎక్కువ లోతు నుంచి పిల్లర్స్ లేపాల్సి ఉంటుందని నివేదిక ఇచ్చారు. ఐదేళ్ల క్రితమే దాదాపు రూ.100 కోట్లు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి రూ.120 కోట్లతో డీపీఆర్ ప్రకటించి పనులు ప్రారంభిస్తామని చెప్పి 8 నెలలైంది. ఏడేళ్ల టైంలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రకటించిన డీపీఆర్ తో బ్రిడ్జి ఎలా నిర్మిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

డీపీఆర్​కు పర్మిషన్ ఇచ్చినా.. 
పెద్దపల్లి బ్రిడ్జికి రూ.70 కోట్లు, అంతర్గాం బ్రిడ్జికి రూ.125 కోట్లతో ఏర్పాటు చేసిన డీపీఆర్​కు కేంద్రం పర్మిషన్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జిల నిర్మాణం మరుగున పడిపోయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి మహరాష్ట్ర, మధ్యప్రదేశ్,  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సరుకుల రవాణా సులభమవుతుంది. పెద్దపల్లి ఆర్ఓబీ పూర్తయితే పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా హన్మకొండ, పెద్దపల్లి నుంచి ముత్తారం, ఖమ్మంపల్లి మీదుగా భూపాలపల్లి నుంచి ఖమ్మం వెళ్లేందుకు మార్గం ఈజీ కానుంది. వీటి నిర్మాణం కోసం జిల్లాలోని పలు సంఘాలు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

అంతర్గాం బ్రిడ్జిని మరిచిన సర్కార్..
ఇటీవల బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రకటించిన లిస్ట్​లో అంతర్గాం బ్రిడ్జి లేకపోవడంతో జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటైనపుడు సీఎం కేసీఆర్ అంతర్గాం, మంచిర్యాల బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. మొదటి టర్మ్ లో అది సాధ్యం కాలేదు. రెండో టర్మ్ పార్టీ అధికారంలో కి వచ్చాక 2018లో  బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.125 కోట్లతో డీపీఆర్ ఇచ్చారు, దానికి అనుమతులు వచ్చాయి. ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. అయినా ప్రభుత్వం టెండర్లు పిలువడంలో నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. కన్​స్ట్రక్షన్ లేట్ కావడంతో ఇప్పడు నిర్మాణ వ్యయం డబుల్ అయింది. దీంతో సర్కార్ డైలమాలో పడింది.