దిశ ఎన్‌‌కౌంటర్‌‌లో పోలీసుల పాత్ర తేల్చాల్సిందే

దిశ ఎన్‌‌కౌంటర్‌‌లో పోలీసుల పాత్ర తేల్చాల్సిందే

హైదరాబాద్, వెలుగు :  దిశ హత్య కేసు నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం (302) కింద ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయాల్సి ఉందని హైకోర్టుకు సహాయకారిగా (అమికస్‌‌క్యూరీ) నియమితులైన సీనియర్‌‌ అడ్వకేట్‌‌ దేశాయ్‌‌ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. నిందితులపై కాల్పులు జరిపిన పోలీసులపై  చర్యలు తీసుకోకుండా కేసును మూసేయడం అన్యాయమన్నారు. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారో లేదో అనేది కేసు కింది కోర్టులో ట్రయల్​కు వచ్చినప్పుడు తేలుతుందన్నారు. అప్పటి వరకు ఆ పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందేనని చెప్పారు. షాద్‌‌నగర్‌‌ సమీపంలో 2019 డిసెంబర్‌‌  6న జరిగిన దిశ ఎన్‌‌కౌంటర్‌‌  ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన పోలీసులపై కేసుల నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టింది. ప్రకాశ్ రెడ్డి వాదన కొనసాగిస్తూ..  సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌‌  సిర్పూర్కర్‌‌ కమిషన్‌‌  రిపోర్టులో పోలీసుల పాత్ర గురించి క్లియర్‌‌గా ఉందన్నారు.

ఘటనా స్థలానికి నిందితులను తీసుకెళ్లడంపై కమిషన్‌‌ సందేహాలు వ్యక్తం చేసిందన్నారు. పోలీసులు తమకు అనుకూలంగా ఉన్న ఎవిడెన్స్‌‌ మాత్రమే సేకరించి రిపోర్టు తయారు చేశారన్నారు. దిశ తండ్రి తరఫు వాదనలు వినిపించేందుకు పర్మిషన్  ఇవ్వాలని సీనియర్‌‌  లాయర్‌‌ వివేక్‌‌ రెడ్డి కోరారు. మానిన గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతారని హైకోర్టు ప్రశ్నించింది. సిర్పూర్కర్‌‌ రిపోర్టుపై అనుమానాలు ఉంటే సవాల్‌‌  చేయవచ్చని సూచించింది. పోలీస్‌‌ ఆఫీసర్స్‌‌  అసోసియేషన్‌‌ను ప్రతివాదిగా చేర్చి వాదనలు విపించేందుకు అనుమతి ఇవ్వాలని మరో సీనియర్‌‌  అడ్వకేట్​ నిరంజన్‌‌రెడ్డి కోరారు. అసోసియేషన్‌‌ను ప్రతివాదిగా చేయాలో వద్దో తేలుస్తామని హైకోర్టు చెప్పింది. విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.