
ముంబై: బ్యాంకు లాకర్ల రూల్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. లాకర్లకు చెల్లించే యాన్యువల్ రెంట్‌కి 100 రెట్ల దాకానే బ్యాంకులకు లయబిలిటీ (బాధ్యత) ఉంటుందని ఈ గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. ఫైర్, దొంగతనం, భవనం కూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసాలు వంటి కారణంగా లాకర్లలో దాచుకున్న వస్తువులు పోతే యాన్యువల్ రెంట్‌కి 100 రెట్ల దాకా మాత్రమే బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ కొత్త గైడ్‌లైన్స్ జనవరి 1, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. ఇల్లీగల్ లేదా హాని కలిగించే వాటిని లాకర్లలో ఉంచరాదనే నిబంధనను లాకర్ ఎగ్రిమెంట్లో చేర్చాల్సిందిగానూ బ్యాంకులకు సూచించింది. ఇప్పటికే లాకర్లు తీసుకున్న వారికీ, కొత్తగా తీసుకోబోయే వారికీ కూడా ఈ కొత్త గైడ్‌లైన్స్ వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్రాంచ్‌ల వారీగా ఖాళీగా ఉన్న లాకర్ల వివరాలను బ్యాంకులు మెయింటెయిన్ చేయాలని, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో వెయిటింగ్ లిస్ట్‌ను కూడా ఉంచాలని సూచించింది. లాకర్ల అలాట్మెంట్లో ట్రాన్సపరెన్సీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. లాకర్లకు వచ్చే అప్లికేషన్స్ అన్నింటికీ రిసీట్ ఇవ్వాలని, అందులో వెయిటింగ్ లిస్ట్ నెంబర్‌ను పొందుపరచాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకుల కోసం మోడల్ లాకర్ ఎగ్రిమెంట్‌ను ఐబీఏ రూపొందించాలని సూచించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్లు నాశనమైతే బ్యాంకులకు ఎలాంటి బాధ్యతా ఉండదని కూడా స్పష్టం చేసింది.