తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలువులు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. కంపార్ట్ మెంట్లన్ని నిండిపోయి బయట క్యూలైన్లలో బారులు భక్తులు తీరారు. శిలాతోరణం వరకు క్యూలైన్లు చేరుకున్నాయి. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. పెరటాసి మాసం సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం వర్షం పడటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో భక్తుల రద్దీపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రద్దీ టైంలో భక్తులు ఓపికతో ఉండాలని ఆయన కోరారు. రష్ ను దృష్టిలో పెట్టుకొని తిరుమలకు వచ్చేందుకు భక్తులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 

అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న రద్దీ నిన్నటి నుంచి క్రమంగా పెరిగింది. రెండో శనివారంతో పాటు  దసరా సెలవులు ముగుస్తుండటంతో రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా రష్ కొనసాగే అవకాశం ఉందని వారు అంటున్నారు. మరోవైపు తిరుమలలో 9 రోజులపాటు శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగిన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అయితే  రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించటంతో దాదాపు 8 లక్షల మంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.