కారు నిలిపివేత: గర్భిణీ ఇబ్బంది పడుతున్నా కనికరం చూపని పోలీసులు

కారు నిలిపివేత: గర్భిణీ ఇబ్బంది పడుతున్నా కనికరం చూపని పోలీసులు
  • చలాన్ పెండింగ్ ఉందని అరగంట కారు నిలిపివేత
  • వాహనం పై పెండింగ్ చలాన్ లు ఉన్నాయని, చెల్లించి వెళ్లాలని  40 నిమిషాలు ఆపిన పోలీసులు
  • క్యాష్ లేదని ఆన్ లైన్ పేమెంట్ చేస్తామని చెప్పిన కుటుంబ సభ్యులు, ఒప్పుకొని పోలీసులు.

మెదక్, వెలుగు:పెండింగ్ చలాన్ పేరుతో అరగంటకు పైగా కారును ఆపివేసి నిండు గర్భిణిని ఇబ్బందులకు గురి చేసిన పోలీసుల వైనమిది. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన గర్భిణీ శిల్పకు జిల్లా కేంద్రమైన మెదక్  పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో  చెకప్ కోసం కుటుంబ సభ్యులు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో 161 నేషనల్ హైవే మీద  వెహికిల్ చెకింగ్ చేస్తున్న అల్లాదుర్గం పోలీసులు వారి కారును ఆపారు. సదరు కారు మీద  రెండు చలాన్ (రూ.2,700)లు పెండింగ్ ఉన్నాయని, అవి చెల్లించే వరకు కారు వెళ్లనివ్వమని స్పష్టం చేశారు. గర్భిణీని హాస్పిటల్ కు తీసుకెళ్తున్నామని, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని ఇంటికి వెళ్ళాక ఆన్ లైన్ లో చలాన్ పేమెంట్ చేస్తానని చెప్పిన పోలీసులు వినిపించు కోలేదని కారు డ్రైవర్ తెలిపాడు. అరగంటకు పైగా కారును వెళ్లకుండా ఆపడంతో గర్భిణీ శిల్ప ఇబ్బంది పడ్డట్టు చెప్పారు. చివరకు సీఐ కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు తమను వదిలి పెట్టారని తెలిపారు. కాగా ఆల్లాదుర్గం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.