సర్కార్ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దుపై రగడ

సర్కార్ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దుపై రగడ
  • నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ ఇవ్వాలని డాక్టర్ల డిమాండ్
  • ఇతర రాష్ట్రాల్లోనూ బ్యాన్ ఉందంటున్న సర్కార్
  • జీతాలు ప్రైవేట్ కంటే ఎక్కువే ఉన్నాయంటున్న ఆఫీసర్లు
  • నేడు డాక్టర్స్ అసోసియేషన్ల మీటింగ్

హైదరాబాద్, వెలుగు: సర్కార్ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ ను రద్దు చేయడంపై దుమారం కొనసాగుతోంది. ప్రైవేట్ ప్రాక్టీస్ ను రద్దు చేసినందున తమకు నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ (ఎన్‌‌‌‌‌‌‌‌పీఏ) ఇవ్వాలని గవర్నమెంట్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వేతనంలో కనీసం 60 శాతాన్ని ఎన్‌‌‌‌‌‌‌‌పీఏగా అదనంగా కలిపి ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై తెలంగాణ గవర్నమెంట్ టీచింగ్ డాక్టర్ల అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం తమతో చర్చించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ఈ విషయంపై తమను సంప్రదించి ఉంటే బాగుండేదని అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని బ్యాన్ పెట్టడం వల్ల ప్రభుత్వ సర్వీస్‌‌‌‌‌‌‌‌లోకి డాక్టర్లు రాకపోతే అంతిమంగా ఆ ప్రభావం పేషెంట్లపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. స్టాఫ్ లేకపోతే కొత్తగా ప్రారంభించబోయే మెడికల్ కాలేజీలకు గుర్తింపు కూడా దక్కదని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో 79 శాతం మంది ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారని, 21 శాతం మందికే ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయని గుర్తు చేసింది. సర్కార్ నిర్ణయం వల్ల మరింత మంది జనాలు ప్రైవేటుకు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్‌‌‌‌‌‌‌‌, సకాలంలో ప్రమోషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు స్పెషల్ అలవెన్స్‌‌‌‌‌‌‌‌ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని అసోసియేషన్ కోరింది. కాగా, ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్‌‌‌‌‌‌‌‌పై ఆదివారం అన్ని డాక్టర్ల అసోసియే షన్లతో మీటింగ్ నిర్వహించనున్నట్టు హెల్త్ రిఫార్మ్స్‌‌‌‌‌‌‌‌ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో బ్యాన్

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ విషయంలో నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ, గుజరాత్‌‌‌‌‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోనూ ప్రైవేట్ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌పై బ్యాన్ ఉందని, ఇవన్నీ పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నాన్ ప్రాక్టీస్ అలవెన్స్‌‌‌‌‌‌‌‌కు బదులు వేతనమే ఎక్కువగా ఇస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నెలకు రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నెలకు రూ.80 వేలు వస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు అలవెన్స్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లలో ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌తో ఉన్న డాక్టర్లకు రూ.40 వేలకు మించి ఇవ్వడం లేదని, ఈ విషయం డాక్టర్లకు కూడా తెలుసన్నారు.