ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు

ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు

28 నుంచి ఐదో విడత పాదయాత్ర
ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు
భైంసాలో ప్రారంభం, వచ్చే నెల 17న కరీంనగర్​లో ముగింపు
మొత్తం 20 రోజులు, 222 కిలోమీటర్లు 
5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాగనున్న యాత్ర 

హైదరాబాద్, వెలుగు : బీజేపీ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని భైంసా నుంచి యాత్ర ప్రారంభం కానుంది. వచ్చే నెల 17 న కరీంనగర్​లో ముగియనుంది. మొత్తం 20 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర 222 కిలో మీటర్ల మేర సాగనుంది. ఐదు  జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర రూట్ మ్యాప్ రెడీ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి ఈ యాత్ర షెడ్యూల్​ను ప్రకటించారు. అనంతరం యాత్రకు సంబంధించిన పోస్టర్​ను రిలీజ్ చేశారు.

ఈ సమావేశంలో మనోహర్ రెడ్డితో పాటు పాదయాత్ర సహ ప్రముఖ్ లు వీరేందర్ గౌడ్,  కుమ్మరి శంకర్, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్  పాల్గొన్నారు. ఈ నెల 28 న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నేరుగా భైంసా వెళ్తారు. అక్కడి వై జంక్షన్ పర్ది బైపాస్ రోడ్ వద్ద నిర్వహించే సభలో సంజయ్ ప్రసంగిస్తారు. తర్వాత అక్కడి నుంచి ఆయన తన ఐదో విడత పాదయాత్ర ప్రారంభిస్తారు. మొదటి రోజు 6.3 కి.మీలు నడిచి ముథోల్ నియోజకవర్గంలోని గుండగామ్ సమీపంలో రాత్రి బస చేస్తారు. రెండోరోజు గుండగామ్ నుంచి మహాగాన్, చటా మీదుగా లింబాకు చేరుకుంటారు.

మూడో రోజు లింబా నుంచి కుంటాల, అంబకంటి మీదుగా మొత్తం 13.7 కి.మీలు నడిచి బామిని బూజుర్గ్ సమీపంలో రాత్రి బస చేస్తారు. పాదయాత్ర మొదటి మూడు రోజులు ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కొనసాగనుంది. నాలుగో రోజైన డిసెంబర్ 1 నుంచి 6 వరకు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. 6, 7న ఖానాపూర్ నియోజకవర్గం, 8, 9, 10న కోరుట్ల నియోజకవర్గం, 11 న మేడిపల్లిలో, 12 న జగిత్యాల టౌన్ లో పాదయాత్ర కొనసాగుతుంది. 13, 14, 15, 16న చొప్పందండి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. 16 న సాయంత్రం కరీంనగర్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. చివరి రోజైన 17 న కొత్తపల్లి హవేలి, రేకుర్తి మీదుగా కరీంనగర్ సిటీలోని ఎస్సారార్ కళాశాల వద్ద పాదయాత్ర ముగుస్తుంది. సాయంత్రం ఆ కాలేజీ గ్రౌండ్ లో ముగింపు సభ నిర్వహిస్తారు.