కేసీఆర్ చదివిన స్కూల్.. ఎలా అయిందంటే..

కేసీఆర్ చదివిన స్కూల్.. ఎలా అయిందంటే..
  • కేసీఆర్తోనే ఓపెనింగ్ అంటూ.. అలాంటి వాటికి అవకాశం కల్పిస్తారా?
  • బడి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభించరా?
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట జిల్లా: దుబ్బాకలో సీఎం కేసీఆర్ చదివిన స్కూల్ ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం బాధగా ఉందన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. బడి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభించక పోవడం దారుణమన్నారు. నిర్మాణం పూర్తయి.. ప్రారంభోత్సవం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న హైస్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు సందర్శించారు. 
ఈ సందర్భంగా స్కూలు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2020లోనే నిర్మాణం పూర్తయిన భవనాన్ని కేసీఆర్ తో ప్రారంభోత్సవం చేయించాలని ఆలస్యం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. హైస్కూలు తరగతులతోపాటు జూనియర్ కళాశాల కూడా నిర్వహించాలనే ఆలోచనతో సుమారు రూ. 10 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన భవనానికి ప్రహరీ గోడ లేకపోడంతో ఆకతాయిలు అద్దాలు ధ్వంసం చేశారన్నారు రఘునందన్ రావు. కిటికీల్లో నుంచి గదుల్లోకి ప్రవేశించి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని.. ఆకతాయిలకు మంచి అవకాశం కల్పించినట్లు  కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా సరే వెంటనే ప్రారంభోత్సవం చేసి విద్యార్థుల తరగతులకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకే వెంటనే ప్రారంభోత్సవం చేసేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశానని ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు.