భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు

భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) రెండో గెజిట్ విడుదలైంది. మరో 6 గెజిట్ లను దశల వారీగా విడుదల చేయనున్నట్లు నేషనల్​హైవే అధికారులు చెబుతున్నారు. తాజా గెజిట్ కు సంబంధించి ఓ తెలుగు, ఓ ఇంగ్లీష్ పేపర్ ద్వారా పత్రికా ప్రకటన విడుదల చేశారు. భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు గెజిట్ విడుదల అయిన తేదీ నుంచి అమల్లో వస్తుంది. భూసేకరణ కోసం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 8 ఆర్డీవోల పరిధిలో 8 యూనిట్లను ఖరారు చేస్తూ కేంద్రం ఇటీవల తొలి గెజిట్ ను విడుదల చేసింది. ల్యాండ్ పోతున్న సర్వే నంబర్లు, ల్యాండ్ విస్తీర్ణం, సేకరించే భూమి విస్తీర్ణం వివరాలు గెజిట్ లో పేర్కొన్నారు. తాజాగా  సంగారెడ్డి జిల్లాలోని(ఆందోల్ జోగిపేటసెక్షన్) శివంపేట, కోర్పోల్, వెండికోలే, వెంకటక్రిష్టాపూర్, లింగంపల్లి గ్రామాల వివరాలను వెల్లడించింది. భూయజమానులు తమ అభ్యంతరాలను భూ సేకరణ అధికారికి ఇవ్వాలని పేర్కొంది.  వీరి అభ్యంతరాలను పరిశీలించి వారికి ఆన్సర్లు ఇచ్చిన తరువాత ఆ ప్రాంతాల్లో రోడ్డుకు మార్కింగ్ చేయనున్నారు. భూసేకరణ పనులు మొదలు పెట్టడానికి మరో గెజిట్, పరిహారానికి మరో గెజిట్ ను విడుదల చేయనున్నారు. యాదాద్రి అడిషనల్ కలెక్టర్ భూసేకరణ యూనిట్ లో 208.6090 హెక్టార్ల భూమి,  ఆందోల్ ఆర్డీవో పరిధిలో108.9491 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టుకు సేకరించనున్నట్లు గెజిట్ లో వెల్లడించింది.