సెక్రటేరియట్ మరో మూడు రోజుల్లో నేలమట్టం

సెక్రటేరియట్ మరో మూడు రోజుల్లో నేలమట్టం
  • సోమవారం వరకు  కూల్చివేతలు పూర్తి
  • కోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎం రివ్యూ
  • రంగంలోకి అత్యాధునిక హైడ్రాలిక్ మెషిన్లు
  • రాత్రి కూడా పనులు స్పీడయ్యేలా ఏర్పాట్లు
  • అన్ని సౌకర్యాలతో కొత్తది నిర్మిస్తామన్న  కేసీఆర్​
  • త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:వారం రోజులు ఆగిన సెక్రటేరియట్​ కూల్చివేత పనులు మళ్లీ షురూ అయ్యాయి. కూల్చివేతకు అనుకూలంగా శుక్రవారం హైకోర్టు తీర్పు ఇలా వచ్చిందో లేదో అలా అరగంటలోనే పనులు జోరందుకున్నాయి. రెండు మూడు రోజుల్లోనే కూల్చివేతలు మొత్తం పూర్తిచేయాలని ప్రభుత్వం డిసైడైంది. రాత్రింబవళ్లు పనులు చేయాలని, సోమవారం వరకు పని పూర్తి కావాలన్న ఆదేశాలు ఉన్నాయని ఆర్​ అండ్​ బీ ఆఫీసర్లు చెబుతున్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెక్రటేరియట్ కాంప్లెక్స్​లో 11  బ్లాక్ లున్నాయి. ఇవన్నీ భారీ మల్టీ స్టోర్​ బిల్డింగ్​లు. ఇప్పటికే దాదాపు 70 శాతం కూల్చివేత పనులు పూర్తయినట్లు ఆర్​ అండ్​ బీ ఆఫీసర్లు చెప్తున్నారు. ఏ, సీ, జీ, నార్త్​ హెచ్​ బ్లాక్​లు నామరూపాలు లేకుండా కూల్చేశారు. ఎన్టీఆర్​ గార్డెన్​ వైపు ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​కు చెందిన రాక్​ బిల్డింగ్​ను పూర్తిగా నేలమట్టం చేశారు. సౌత్ హెచ్​ బ్లాక్ 20 శాతం, డీ బ్లాక్ 50 శాతం, బీ బ్లాక్ 30 శాతం మేరకు కూల్చివేశారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్​పైనుంచి చూస్తే కనిపించే ఎత్తయిన ఎల్, జే బ్లాకుల కూల్చివేతే మిగిలిందని, మిగతావన్నీ మట్టి దిబ్బలుగా మారిపోయాయని ఓ ఆఫీసర్​ చెప్పారు.

శిథిలాల తరలింపునకు 15 వేల ట్రిప్పులు

బిల్డింగ్స్​ కూల్చివేతతో ఏర్పడుతున్న సిమెంట్, ఇటుక,​ రాళ్లు, మట్టి వంటి శిథిలాలను రాత్రి వేళ డంప్ చేసేందుకు ఆఫీసర్ల్​ ప్లాన్ చేస్తున్నారు. వీటిని సిటీ శివారులో ఔటర్​ రింగ్​ రోడ్డు సమీపానికి  తరలించే అవకాశం ఉంది. దాదాపు లక్ష టన్నుల శిథిలాలు ఏర్పడుతాయని, వీటిని తరలించాలంటే కనీసం 15 వేల లారీ ట్రిప్పులు అవసరమని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు రిపోర్ట్​ చేశారు. నెల రోజుల్లో శిథిలాలన్నీ ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు.

శ్రావణ మాసంలో కొత్త సెక్రటేరియట్​ పనులు

శ్రావణ మాసంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ఈ నెల 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభకానుంది. కొత్త సెక్రటేరియట్​ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలిచేందుకు ఆర్ అండ్ బీ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘కూల్చివేతలు సోమవారం నాటికి పూర్తయ్చే చాన్స్  ఉంది. బిల్డింగ్ నిర్మించే ప్రాంతంలో నేల మొత్తం చదును చేయడానికి రెండు రోజుల టైం పడుతుంది. ఆ ప్రాసెస్​ పూర్తి కాగానే నిర్మాణ పనులు చేపడుతం’’ అని ఆఫీసర్లు చెప్తున్నారు.

సకల సౌకర్యాలతో కొత్త సెక్రటేరియట్: సీఎం 

సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చివేతలపై లీగల్​ వివాదాలు తొలిగిపోవడంతో శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్​ సమీక్షించారు. కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. అడ్మినిస్ట్రేషన్ కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలన్నారు. ‘‘సెక్రటేరియట్  కొత్త బిల్డింగ్స్​ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. పూర్తి సౌకర్యవంతంగా ఉండాలి. సీఎం, మంత్రులు, సీఎస్, సెక్రటరీలు అంతా అందులోనే తమ డ్యూటీలు నిర్వర్తించేలా ఉండాలి. అక్కడొకరు ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు. మంత్రులు, కార్యదర్శులు ఒకే చోట ఉండాలి. సెక్రటేరియట్ సమీపంలోనే అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల ఆఫీసుల కాంప్లెక్స్​ను కూడా నిర్మిస్తాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుంది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘సెక్రటేరియట్ బయట ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంతే సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ఉండాలి. దీనికి సంబంధించి మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, మీటింగ్ హాల్స్, సిబ్బంది ఆఫీసులు, లంచ్ హాల్స్, సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూములు ఎలా ఉండాలో నిర్ణయించాలి’’ అని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ స్థలంలోనే ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్, విజిటర్స్ రూమ్, పార్కింగ్, సెక్యూరిటీ ఆఫీసు ఉండాలని, వాటిని ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలని చెప్పారు. సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉండాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, చీఫ్ అడ్వయిజర్ రాజీవ్ శర్మ, సీఎస్  సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

భారీ మెషిన్లతో కూల్చివేత

సెక్రటేరియట్​ బిల్డింగ్స్​ కూల్చివేత కోసం అత్యాధునిక హైడ్రాలిక్​ మెషిన్లను వాడుతున్నారు. పుణె నుంచి తెప్పించిన రెండు పెద్ద మెషిన్లతో నిర్విరామంగా పనులు చేపడుతున్నారు. ఇవి ఒక్కోటి 26 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఈ ఒక్కో మెషిన్​తో 12 అంతస్తుల బిల్డింగ్​ను కూల్చేయడానికి కేవలం మూడు గంటల టైమ్​ పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.  అదేవిధంగా 22 మీటర్ల ఎత్తయిన  4 మెషిన్లు,16 మీటర్ల ఎత్తయిన మరో రెండు మెషిన్లు  కూడా వాడుతున్నారు. శిథిలాలను కుప్పలుగా వేసేందుకు 30  ఎక్స్​క వేటర్లను ఉపయోగిస్తున్నారు. శిథిలాలను హైదరాబాద్ శివారు ప్రాంతానికి తరలించేందుకు దాదాపు 100 టిప్పర్లను రెడీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే 500 మంది బీహార్ నుంచి వచ్చిన టెక్నిషియన్లు, ఇంజనీర్లు, కూలీలు  సెక్రటేరియట్​ కూల్చివేత పనులు చేపడుతున్నారు.

తీర్పు వచ్చీరాగానే సీఎం రివ్యూ

ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి అత్యంత రహస్యంగా సెక్రటేరియట్ బిల్డింగ్స్​ కూల్చివేత పనులను ప్రభుత్వం చేపట్టగా.. ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చేస్తున్నారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 10న హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు ఆగిపోయాయి. శుక్రవారం హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కోర్టు తీర్పు రాగానే హుటాహుటిన సీఎం కేసీఆర్​ ఆర్​అండ్​బీ ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు. ఇటు రివ్యూ కొనసాగుతుండగానే.. అటు సెక్రటేరియట్​ కూల్చివేత పనులు మళ్లీ స్టార్ట్​ చేశారు. మొదట్నుంచి కూల్చివేత పనులను స్వయంగా పర్యవేక్షిస్తోన్న సీఎస్, డీజీపీ శుక్రవారం సాయంత్రం సెక్రటేరియట్ లోకి వెళ్లి పరిశీలించారు.

డేంజర్ జోన్ లో జిల్లాలు..పెరుగుతున్న కేసులు