వెండి కేవలం ఒక ఆభరణం లేదా బంగారానికి ప్రత్యామ్నాయంగా మాత్రమే కాదు. 2026 నాటికి పెట్టుబడి ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన లోహంగా వేగంగా మారుతోంది. బంగారం మాదిరిగానే విలువను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న సిల్వర్.. పెరుగుతున్న పారిశ్రామిక వినియోగం, తగ్గుతున్న సరఫరా మధ్య కుదరని పొంతన కారణంగానే ఇటీవల భారీగా పెరుగుతోంది. గ్రీన్ మెుబిలిటీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెరుగుతున్న యూసేజ్ కి తోడు రిటైల్ వినియోగదారుల నుంచి డిమాండ్ కొత్త గరిష్టాలకు ర్యాలీని ప్రేరేపిస్తోంది. అమెరికన్ డాలర్‌లో నిరంతర అస్థిరత, మార్కెట్ ఒత్తిడి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెండిని ఒక హెడ్జ్ లాగా చూస్తున్నారు. చారిత్రక పరంగా కొనుగోలు శక్తిని కాపాడుకునే దాని సామర్థ్యం, అలాగే ఈక్విటీల నుండి భిన్నంగా కదిలే దాని స్వభావం, పోర్ట్‌ఫోలియో వైవిధ్యత కోసం దీనిని వ్యూహాత్మక ఆస్తిగా నిలబెట్టింది.
పారిశ్రామిక డిమాండ్‌లో మార్పు..
వెండికి పెట్టుబడిదారుల నుంచి ఆకర్షణ పెరగడానికి ప్రధాన కారణం దాని పారిశ్రామిక వినియోగంలో వస్తున్న మార్పులు. ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య పరికరాల వంటి వేగంగా విస్తరిస్తున్న రంగాల నుంచి డిమాండ్ ఇప్పుడు ప్రపంచ సిల్వర్ వినియోగంలో సగానికి పైగా ఉందని వెల్లడైంది. ఇటీవల రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో సౌర ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్ సాంకేతికతలలో వెండి వినియోగం డిమాండ్ పెంచుతోంది.
మార్కెట్లో సిల్వర్ డిమాండ్ పెరుగుతున్న వేళ అదే స్థాయిలో సరఫరాలు లేకపోవటం ర్యాలీని స్పీడప్ చేసింది. వాస్తవానికి వెండి ఎక్కువగా రాగి, జింక్, బంగారం వంటి ఇతర లోహాల త్రవ్వకంలో ఉప-ఉత్పత్తిగా లభిస్తుంది. వెండికి ప్రత్యేకంగా ఎలాంటి మైన్స్ ఉండవు. అందుకే డిమాండ్ పెరిగినప్పటికీ మైనింగ్ ఉత్పత్తి నెమ్మదిగా ఉంది. తాజా అంచనాలు కూడా కొరత కొనసాగుతుందని సూచిస్తున్నాయి.
90% ఈక్విటీలు.. 10% వెండితో కూడిన పోర్ట్‌ఫోలియో గత 10 ఏళ్లలో కేవలం ఈక్విటీ పోర్ట్‌ఫోలియో కంటే మెరుగైన పనితీరును కనబరిచినట్లు Edelweiss వెల్లడించింది. ఇది పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు తక్కువ అస్థిరతను కూడా అందించింది. అంటే వెండి పోర్ట్‌ఫోలియో నష్టాలను తగ్గించడంలో సహాయపడుతూనే, లాభాలను పెంచడంలో తోడ్పడినట్లు తేలింది. గోల్డ్-సిల్వర్ నిష్పత్తి సాధారణ స్థాయికి చేరుకోవడం, బంగారం ధరతో పోలిస్తే వెండి సహేతుకమైన విలువతో ఉందని తేలింది. చాలా మంది పెట్టుబడిదారులు ప్రస్తుతం డిజిటల్ అధికారిక పెట్టుబడి మార్గాలైన ఈటీఎఫ్స్, సిల్వర్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను అందుకుంటున్నారు.
