మెుదటి సారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అలా మాత్రం అస్సలు చేయెుద్దు

మెుదటి సారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అలా మాత్రం అస్సలు చేయెుద్దు

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిని ప్రారంభించే ఇన్వెస్టర్లలో అనేక ఆలోచనలతో పాటు అనుమానాలు సహజంగా ఉంటుంటాయి. చాలా మంది స్టార్టింగ్ లోనే తాము రీసెర్చ్ చేసిన డేటాతో 'టాప్ రిటర్న్స్' ఇచ్చిన ఫండ్స్ లిస్ట్ తీసుకుని వాటిలోని వివిధ కేటగిరీ ఫండ్స్ కింద పెట్టుబడులు పెట్టడం చూస్తుంటాం. కానీ కేవలం ఒకే ఒక్క ఫ్లెక్సీ-క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేవారు 5 ఏళ్ల తర్వాత మెరుగైన ఫలితాలు, తక్కువ ఒత్తిడిని పొందుతారు. దీనికి కారణం సరైన పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయటమే..

అయితే నిపుణులు మాత్రం మెుదటి ఫండ్ కొంత బోరింగ్ గా ఉండాలని సూచిస్తున్నారు. తొలి ఫండ్ మార్కెట్‌లో విస్తృత స్థాయి ఎక్స్‌పోజర్ ఇవ్వడం భారీ నష్టాలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. అలాగే అది ప్రతినెల స్థిరంగా పెట్టుబడులను కొనసాగించే అలవాటును అలవరుస్తుందని అంటున్నారు. కొత్త ఇన్వెస్టర్లకు ఇది డ్రైవింగ్ నేర్చుకోవటం లాంటిదని.. అందుకే నిలకడైన రోడ్లపై జర్నీ స్టార్ట్ చేయాలన్నారు. సాధారణంగా తొలిసారి ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఇది కాకుండా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా మరో మంచి ఎంపిక. ఇందులో స్మాల్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మేళవింపు ఉంటుంది. 

చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు నిన్నటి విజేతలే రేపటికీ గెలుస్తారనే భ్రమలో ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో వారు సెక్టార్ లేదా థీమాటిక్ ఫండ్స్ వంటి వాటిని ఎంచుకుంటుంటారు. కానీ నిన్నటి విజేత తరచుగా రేపటి నిరాశకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వారు వచ్చాక మార్కెట్ కరెక్షన్ కి గురై పెట్టుబడి ఆవిరై.. నష్టాల్లో హడావిడిగా వాటిని అమ్మేస్తుంటారు. ఇది పూర్తిగా టైమింగ్ అండ్ ఫండ్ సెలక్షన్ మిస్టేక్ అంటున్నారు నిపుణులు. 

ఒకే కేటగిరీకి చెందిన వివిధ ఫండ్స్ హోల్డ్ చేయటం వల్ల అవే స్టాక్స్ కొంటున్నట్లు చాలా మంది మర్చిపోతుంటారు. అందుకే కోర్ ఫండ్స్ తో ప్రయాణం స్టార్ట్ చేయటం బెటర్. స్మాల్ క్యాప్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ జోలికి తొలినాళ్లలోనే అడుగుపెట్టకపోవటం మంచిదని గుర్తుంచుకోవాలి కొత్త ఇన్వెస్టర్లు. 

అన్నింటి కంటే ముఖ్యం సెలెక్ట్ చేసుకునే ఫండ్ లాభాలతో పాటు రిస్క్ కూడా బేర్ చేయగలిగే స్థాయిలో ఉందోలేదో ఖచ్చితంగా పరిశీలించుకోవాలని నిపుణులు కొత్త ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. SIPని సంవత్సరాల పాటు నిలకడగా కొనసాగించటం, వైవిధ్యభరితమైన ఫండ్‌ను ఎంచుకోవటం ఇతరుల కంటే మెరుగైన రాబడులను పొందటానికి తోడ్పడుతుందని కొత్త ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్ నిపుణులు చెబుతున్నారు. అందుకే 'టాప్ రిటర్న్స్' అనే పదం చుట్టూ తిరగటం ఫస్ట్ మానేయాలని హెచ్చరిస్తున్నారు.