స్వరాష్ట్ర పాలనలో అప్పుల్లో సింగరేణి

స్వరాష్ట్ర పాలనలో అప్పుల్లో సింగరేణి

తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపునకు సింగరేణి ఉద్యోగులు, కార్మికులు స్పందించారు. 37 రోజులు సమ్మె చేపట్టి రాష్ట్రం కోసం ముందు ఉండి కొట్లాడిన్రు. ‘తెలంగాణ సాధించు – సింగరేణిని రక్షించు’ అనే నినాదంతో జే‌‌ఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. రాష్ట్రం ఏర్పడితే.. సింగరేణి మరింత అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని, ఉద్యోగులు, కార్మికుల బతుకులు మారుతాయని అంతా అనుకున్నారు. కానీ ఇయ్యాల పరిస్థితి అట్ల లేదు. సంస్థ అప్పుల ఊబిలోకి వెళ్తోంది. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది. కార్మికులు భద్రతను పట్టించుకునే వారే లేరు. రెగ్యులర్​ఉద్యోగులు తగ్గి కాంట్రాక్టు కార్మికులు పెరుగుతున్నారు. ఉమ్మడి పాలనలో లాభాల్లో ఉన్న సింగరేణిని.. ఇయ్యాల ఉద్యోగుల జీతాల కోసం కూడా బ్యాంకులను అప్పు అడగాల్సిన దుస్థితికి దిగజార్చారు.

అవుట్ ​సోర్సింగ్​ పెరిగింది..

2014 ఏప్రిల్ 1 నాటికి సింగరేణి ఉద్యోగుల సంఖ్య 62 వేలు కాగా, 2022 జనవరి 31 చివరి నాటికి 42 వేలే. 2014 నాటికి కాంట్రాక్ట్ కార్మికులు14 వేలు ఉంటే..  ఇప్పుడు 30 వేల మంది ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత సింగరేణి ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గి, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరిగింది. ఔట్ సోర్సింగ్ కార్యకలాపాలు బాగా పెరిగాయి. అప్పట్లో ఓవర్ లోడ్ రిమూవల్ ఆపరేషన్‌‌లు పాక్షికంగా మాత్రమే అవుట్‌‌సోర్స్‌‌లో జరిగేవి. ఇప్పుడు దాదాపు మొత్తం కార్యకలాపాలు అవుట్‌‌సోర్స్ చేశారు. 2014 ఏప్రిల్​1 నాటికి సింగరేణివి రూ.3500 కోట్లు బ్యాంకులో డిపాజిట్ ఉండే. 2014కు ముందు సింగరేణి తన మిగులు నగదును పార్కింగ్ చేయడానికి అధిక వడ్డీ రేట్లు చెల్లించే బ్యాంకుల నుంచి కొటేషన్లను ఆహ్వానించేది. కంపెనీ బిల్లులు, వేతనాలు, సకాలంలో క్లియర్​అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి దారుణంగా తారుమారైంది. 2022 జనవరి 31 నాటికి సింగరేణి రూ.8500 కోట్లు బ్యాంకు అప్పుల్లో ఉన్నది. నిధుల కొరతతో బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి. జీతాలు చెల్లింపునకు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.

23 వేల కోట్ల బకాయిలు

2014 నాటికి వివిధ బొగ్గు కొనుగోలుదారుల నుంచి సింగరేణికి సుమారు 4 వేల కోట్లు బకాయిలు ఉండేవి. అవి కూడా కంపెనీ అధికారిక షరతులు మేరకు వడ్డీతో వసూలు అయ్యేవి. రాష్ట్ర ఏర్పాటు తరువాత బొగ్గు సరఫరా బకాయిలు పేరుకుపోయాయి. జెన్​కో నుంచి రూ.4098.31 కోట్లు, ట్రాన్స్​కో నుంచి రూ.13,712.43 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అయితే ఈ బకాయిలను వడ్డీతో పేర్కొనడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుంచి బొగ్గు, విద్యుత్ బకాయిలపై మొత్తం వడ్డీ దాదాపు రూ. 5000 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఈ వడ్డీతో కలిపితే దాదాపు రూ. 23 వేల కోట్ల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాలి. బకాయిల రికవరీలో సింగరేణి యాజమాన్యం ఘోరంగా విఫలమైంది. సంస్థ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. డిసెంబరు 2014 వరకు డైరెక్టర్(పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్)గా ఒక ఐఏఎస్ అధికారి ఉండేవారు. అనేక ముఖ్యమైన విభాగాలను నిర్వహించే కీలకమైన పోస్ట్ ఇది. ss2015 నుంచి ఈ పోస్టుకు రెగ్యులర్ ఆఫీసర్ ఎవరూ లేరు. ఈ పోస్ట్ భర్తీ కోసం సీఎండీ  వైపు నుంచి ప్రయత్నాలు లేవు. మరో కీలకమైన డైరెక్టర్(ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) పోస్టు కూడా 2019 నుంచి ఖాళీగా ఉంది. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉంచుతున్న యాజమాన్యం.. ఉన్న డైరెక్టర్లపై పని భారం పెంచుతోంది. 

ఎనిమిదేండ్లుగా ఒకే సీఎండీ..

2016 నుంచి ఇప్పటి వరకు బొగ్గు గనుల్లో 53 ప్రమాదాలు జరిగాయి. 67 మంది కార్మికులు మరణించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి చాలా బిజీ షెడ్యూల్‌‌లో ఉన్నప్పటికీ ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించి కార్మికుల కుటుంబాలను ఓదార్చేవారు. కానీ ఇప్పుడు సీఎం పరామర్శ సంగతి అటుంచితే.. కనీసం సీఎండీ కూడా ప్రమాదాలు జరిగినప్పుడు గనులను సందర్శించడం లేదు. ఉత్పత్తిపై శ్రద్ధ పెడుతున్న యాజమాన్యం కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకుంటలేదు. సంస్థలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ ​చేస్తున్నా చర్యలు లేవు.  ప్రస్తుతం సింగరేణి సీఎండీగా శ్రీధర్​నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిదేండ్ల నుంచి కొనసాగుతున్నారు. సింగరేణిలో ఏడాదికి కొనుగోళ్లు, కాంట్రాక్టుల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుంది. అందువల్ల సీఎండీ పోస్టు కీలకమైన పదవి. కొనుగోళ్లు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలకు ఆస్కారం ఉంది. ఒకే వ్యక్తిని 5 ఏండ్లకు పైగా కొనసాగించడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇప్పటికే పలుచోట్ల అక్రమాలు, కుంభకోణం జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఆయనను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

రాజకీయ జోక్యం

సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపించిన సీ‌‌ఎం‌‌డీల్లో ఏ‌‌పీవీ‌‌ఎన్ శర్మ, నర్సింగరావు కీలకంగా పనిచేశారు. ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసి జాతీయ కార్మిక సంఘాల సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా సమర్థంగా పనిచేసి సంస్థను అభివృద్ధి బాట పట్టించారు. ప్రస్తుతం సర్పంచ్ నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రుల వరకు సింగరేణిలో అధికార పార్టీ నాయకుల రాజకీయ జోక్యం పెరిగింది. వారికి ప్రొటోకాల్ పాటించాలని ఏకంగా సర్క్యులర్ కూడా ఇవ్వడం గమనార్హం. సింగరేణి అధికారులు ఫైళ్లతో ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లే పరిస్థితి వరకు తీసుకొచ్చారు. కార్మికుడి డ్యూటీ షిఫ్ట్ మార్పు కోసం కూడా రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం బాధాకరం. 

- పి.మాధవ నాయక్, కార్యదర్శి & జేబీసీసీ‌‌ఐ మెంబర్

అఖిల్ భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్- బీఎం‌‌ఎస్