ఇండ్ల నిర్మాణ మెటీరియల్ రేట్లు భారీగా పెరిగినయ్

 ఇండ్ల నిర్మాణ మెటీరియల్ రేట్లు భారీగా పెరిగినయ్

 

  •     స్టీల్, సిమెంట్, ఇటుక, ఇసుక ధరలకు రెక్కలు
  •     కన్‌‌‌‌స్ట్రక్షన్ బంద్ చేస్తున్న బిల్డర్లు
  •     హైదరాబాద్‌‌‌‌లో 10 వేల మందికిపైగా పనులకు దూరం
  •     సొంతంగా ఇండ్లను కట్టుకునే వారిపై పెను ప్రభావం

హైదరాబాద్, వెలుగు: సామాన్య మధ్యతరగతి ప్రజలు ‘ఇల్లు కట్టలేం.. కొనలేం’ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సిమెంట్‌‌‌‌, స్టీల్‌‌‌‌, ఇటుక, ఇసుక, టైల్స్.. ఇలా అన్నింటి రేట్లు పెరిగిపోతుండటంతో ఇల్లు కట్టుకోవడం తలకు మించిన భారమవుతోంది. ధరలకు రెక్కలు రావడంతో ఇండ్ల నిర్మాణ వ్యయం అంచనాలు తారుమారు అవుతున్నాయి. 

సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు.. ఫ్లాట్‌‌ కొనుక్కోవాలనుకునే వాళ్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా బిల్డర్లలో చాలా మంది నిర్మాణ రంగం నుంచి వెళ్లిపోతున్నారు. మరికొందరు తాత్కాలికంగా పనులను ఆపేశారు. దాదాపు10 వేల మంది బిల్డర్లు పనులకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పెద్ద బిల్డర్లు మాత్రమే నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాలు చాలా వరకు నిలిచిపోతున్నాయి. రేట్లు తగ్గుతాయేమోనని జనం ఎదురుచూస్తున్నారు.

సొంతింటి కలేనా?

అన్నింటి రేట్లు పెరగడంతో బిల్డర్లు కన్‌‌స్ర్టక్షన్ కాస్ట్‌‌ని పెంచేశారు. 100 గజాల స్థలంలో చిన్నపాటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేందుకు మూడు నెలల క్రితం వరకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.32 లక్షలు మించిపోతున్నది. సిటీ శివారు ప్రాంతాల్లో ఐదారు ఫ్లోర్ల చిన్న అపార్ట్‌‌మెంట్లలో మొన్నటి వరకు చదరపు అడుగు 4 వేల వరకు ఉండేది. ప్రస్తుతం రూ.వెయ్యికి పైగా పెరిగి 5 వేలను మించి ఉంటోంది. అదే సిటీలో ఏరియాని బట్టి రూ.10 వేల వరకు ఉంటోంది. దీంతో సామాన్యుల సొంతింటి కల కలగానే మిగులుతున్నది. కూడబెట్టిన డబ్బులకు కొన్ని అప్పులు చేసి సొంతగా ఓ ఇంటిని నిర్మించుకుందామనుకున్న వారు పెరిగిన రేట్లతో వెనకా ముందు ఆలోచిస్తున్నారు. రోజూ ధరల్లో వస్తున్న మార్పులతో ఇబ్బంది పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో నిర్మాణాలను నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు.

టన్ను స్టీల్ @ లక్ష

రెండు, మూడు నెలల కిందటి దాకా వరకు స్టీల్ రేట్లు కంపెనీని బట్టి టన్నుకి రూ.50 వేల నుంచి రూ.62 వేల వరకు ఉండేవి. ప్రస్తుతం కంపెనీలను బట్టి రూ.లక్ష దాకా ధరలు ఉన్నాయి. రూ.300 గా ఉన్న సిమెంట్‌‌ ధర ఒక్కో బస్తాపై రూ.100 దాకా పెరిగింది. ఇసుక రేటు టన్నుకి నాలుగైదు వందలు పెరిగింది. ఇటుక ధర మొన్నటి దాకా ఒక్కో దానికి రూ.7.50 ఉండగా, ప్రస్తుతం రూ.9.50 గా ఉంది. టైల్స్ రేట్లు స్కైర్ ఫీట్‌‌కి రూ.10 చొప్పున పెరిగాయి. కొద్దిరోజుల కిందటి దాకా ఏరియాని బట్టి టన్ను ఇసుక రేటు రూ.1,600 నుంచి రూ.2,500 దాకా ఉండగా, ప్రస్తుతం రూ.2 వేల నుంచి 3 వేలకు పైగా ఉంటున్నది. ఇలా రేట్లు పెరుగుతుండటంతో అగ్రిమెంట్ చేసుకునే టైంలో కన్‌‌స్ర్టక్షన్ కాస్ట్ విషయంపై కూడా ఓ కాలమ్ రాస్తున్నారు. ఒకవేళ ధరలు ఎక్కువగా పెరిగితే కాస్ట్‌‌లో మార్పులు చేస్తామని బిల్డర్లు అగ్రిమెంట్‌‌లో రాసుకుంటున్నారు.

రేట్లు తగ్గకుంటే మరింత ఎఫెక్ట్

కరోనా కారణంగా మొన్నటిదాకా డీలా పడిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. కానీ పెరుగుతున్న రేట్లతో మళ్లీ ఎఫెక్ట్ పడింది. సిమెంట్, స్టీల్, శానిటరీ, ఎలక్ట్రికల్‌‌ విడిభాగాల ధరలు కూడా విపరీతంగా పెరగటం, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల లేబర్ కాస్ట్ పెరగడం తలకుమించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెంచక తప్పదని బిల్డర్లు అంటున్నారు. ఇప్పటికే వేలాది మంది బిల్డర్లు పనులకు దూరమయ్యారు. క్రెడాయ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజు పనులను బంద్ చేసి నిరసన తెలిపారు. రేట్లు తగ్గకపోతే అందరూ కొన్నాళ్లు పనులు బంద్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పూర్తి స్థాయిలో పనులు నిలిపేస్తే దాదాపు 5 లక్షల కుటుంబాలపై ఎఫెక్ట్ పడనుంది.

40 శాతం కాస్ట్ పెరిగింది

పెరిగిన ధరలతో నిర్మాణ వ్యయం పెరిగింది. స్క్వేర్ ఫీట్‌‌కి రూ.300 నుంచి 400 దాకా కాస్ట్ ఎక్కువైంది. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతది. నిర్మాణ సామగ్రి రేట్లు తగ్గించాలని మేం చేపట్టిన ఒక్క రోజు బంద్ సక్సెస్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ధరలు తగ్గించాలి. లేకపోతే నిర్మాణ రంగంపై చాలా ఎఫెక్ట్ పడేలా ఉంది.
- రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్

కొత్తవి తీసుకోవాల్నంటే భయమైతంది

నిర్మాణ సామగ్రి రేట్లు ఎప్పుడు ఎట్ల ఉంటున్నయో అర్థమైతలేదు. పెరిగిన రేట్లకు సరైన కారణం తెలియడంలేదు. ఇలాంటి టైంలో కొత్తగా ఏదైనా ప్రాజెక్టు తీసుకోవాలంటే భయమేస్తుంది. ప్రస్తుతం ఉన్న వాటినే కడుతున్నం. కొత్తవాటిపై లోతుగా ఆలోచించాల్సి ఉంది. ఒకవేళ తీసుకుంటే అగ్రిమెంట్‌‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. రేట్లు మరింత పెరిగితే ధరని పెంచుతామని అగ్రిమెంట్‌‌లో రాసుకోవాలని అనుకుంటున్నం.
- శ్రీకాంత్ రెడ్డి, బిల్డర్