పట్టుబడిన ‘మట్టి దందా’ వాహనాలు పోలీస్​ స్టేషన్​కు చేరలే

పట్టుబడిన ‘మట్టి దందా’ వాహనాలు పోలీస్​ స్టేషన్​కు చేరలే
  •     హనుమకొండ జిల్లా ఉనికిచెర్ల శివారులో మట్టి దందా
  •     డయల్​ 100కు కాల్​ చేయగా.. పట్టుకున్న పోలీసులు
  •     స్టేషన్​ కు వెళ్లే మార్గంలోనే తప్పించుకున్నారని ప్రకటన

హనుమకొండ, ధర్మసాగర్​, వెలుగు:  హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. శనివారం పోలీసులు పట్టుకున్న వాహనాలు వారి కండ్లు గప్పి కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తున్నది.  ధర్మసాగర్​ మండలం ఉనికిచెర్ల శివారులోని ఓ చెరువులో మండలానికి చెందిన మట్టి దందా వ్యాపారి శనివారం రాత్రి తవ్వకాలు మొదలుపెట్టాడు. రాత్రికి రాత్రి ఒక హిటాచీతో పాటు నాలుగు టిప్పర్లు, కాపలా మనుషులను పెట్టుకుని దందా సాగిస్తున్నాడు.  కాగా రాత్రి సమయంలో మట్టి లోడ్​  వాహనాలు దేవన్నపేట క్వార్టర్స్ మీదుగా ఓవర్​ స్పీడ్​ తో వెళ్తుండడంతో స్థానికులు ‘డయల్​ 100’కు కాల్​ చేశారు. దీంతో అరగంట తర్వాత ధర్మసాగర్​ పోలీసులు  చెరువు వద్దకు చేరుకుని,  వారికి ఎలాంటి పర్మిషన్​ లేకుండానే మట్టిని తవ్వుతున్నట్లు గుర్తించారు. 

అప్పటికే బండ్ల ఓనర్​ నంటూ అక్కడకు  ఓ వ్యక్తి చేరుకోగా..  మట్టి తవ్వకాలకు సంబంధించి పర్మిషన్ కాపీ ​చూపించాలని పోలీసులు అడిగారు. వారి వద్ద ఎలాంటి పర్మిషన్లు, ఎన్​వోసీలు లేవని నిర్ధారించుకుని వాహనాలు ఫొటోలు తీసుకున్నారు. నాలుగు టిప్పర్లు, ఒక హిటాచీని స్టేషన్​కు తరలించాల్సిందిగా సూచించారు. అనంతరం లారీలు ముందు వెళ్తుంటే.. పోలీస్​ వాహనం వారిని అనుసరిస్తూ వెళ్లింది. కానీ  మట్టి తరలిస్తున్న వాహనాలు మాత్రం స్టేషన్​కు చేరలేదు. వాటిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. దేవన్నపేట రింగ్​ రోడ్డు ఎక్కిన తర్వాత తప్పించుకు పారిపోయారని పోలీసులు చెప్తుండగా.. కండ్ల ముందు నుంచి లారీలు ఎలా మాయమవుతాయనే స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేయాల్సిన పోలీసులు వాహనాలను కావాలనే తప్పించారా.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ధర్మసాగర్​ సీఐ రమేశ్​ ను వివరణ కోరగా.. అసలు మట్టి లారీలు పట్టుకున్న విషయం తన దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.