జీతం అందక తండ్రిని కాపాడుకోలేకపోయా

జీతం అందక తండ్రిని కాపాడుకోలేకపోయా
  • గిరిజన ఆశ్రమ హాస్టల్  డైలీ వేజ్ వర్కర్  కొడుకు ఆవేదన
  • ఎనిమిది నెలలుగా పెండింగ్​లో సాలరీ

జైనూర్, వెలుగు : తన తండ్రికి సకాలంలో జీతం అందకపోవడంతో ఆయన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయానని గిరిజన ఆశ్రమ హాస్టల్  డైలీ వేజ్ వర్కర్  కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఆసిఫాబాద్  జిల్లా జైనూర్  మండలం మార్లవాయి గ్రామంలో జరిగింది. మార్లవాయి గిరిజన ఆశ్రమ హాస్టల్ లో డైలీ వేజ్ వర్కర్ గా పని చేస్తున్న మెస్రం జంగు (52) నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ట్రీట్​మెంట్  అందిస్తున్నారు. అయినా ఆయనకు నయం కాలేదు. మెరుగైన ట్రీట్మెంట్  కోసం మంచి ఆస్పత్రికి తీసుకెళ్దామని భావించినా అందుకు సరిపడా డబ్బు లేదు. 

ఎనిమిది నెలలుగా పెండింగ్​లో ఉన్న  జీతం వస్తే ప్రైవేట్​ ఆస్పత్రికి తరలిద్దామని చూసినా ఆ డబ్బులు రాకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో జంగు మంగళవారం చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు, వర్కర్లు, యూనియన్ లీడర్లు జంగు మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆర్థిక సమస్యలతోనే ట్రీట్​మెంట్ అందించక తండ్రిని కోల్పోయానని మృతుని కొడుకు మెస్రం చిన్ను రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ‘‘సకాలంలో జీతం రాక మా నాన్నకు మెరుగైన ట్రీట్​మెంట్ అందించలేకపోయాం. అంత్యక్రియలకు కూడా హాస్టల్  వార్డెన్  జైవంత్  సర్ ఆర్థిక సహాయం అందజేసి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. నాన్న జీతం పడి మెరుగైన ట్రీట్​మెంట్​అందిస్తే ఆయనకు ప్రాణాపాయం తెప్పేదేమో’’  అని చిన్ను బోరుమన్నాడు.