
హైదరాబాద్, వెలుగు: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. అనుకున్న దానికంటే వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాలు శనివారం కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు పూర్తిగా, దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని తెలిపింది. దీని ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
గతేడాది కంటే పది రోజులు లేటు
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. గతేడాది మే 29నే కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేయగా అదే రోజు తీరాన్ని తాకాయి. ఈ ప్రకారం గతేడాదితో పోలిస్తే 10 రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయి. గతేడాది రాష్ట్రంలోకి జూన్ ఆరో తేదీన రాగా, ఈ సారి 13న వస్తాయని, 15 నాటికి రాష్ట్రమంతా విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి నైరుతి ప్రవేశించనుందని చెప్పింది. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారుగా 720 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. 750 మిల్లీమీటర్లు కురిస్తే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణ వర్షపాతం వల్ల.. వర్షాలు మరీ ఎక్కువగా, మరీ తక్కువగా పడవని, దీంతో ఈ పరిస్థితి రైతులకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది 96 శాతం వర్షపాతం నమోదైంది.
ఇక అంతా కూల్ కూల్..
వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో శనివారం రాష్ట్రంలో చల్లని వెదర్ ఏర్పడింది. ఇటీవల ఎండలతో ఉక్కిరి బిక్కిరైన జనం ఉపశమనం పొందారు. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 44.3, ఖమ్మంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా అన్ని చోట్లా 40 డిగ్రీల లోపు రికార్డయింది. హైదరాబాద్‌లో 34 డిగ్రీలు నమోదైంది. నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, నారాయణ పేట, వరంగల్ రూరల్, యాదాద్రి, గద్వాల, వనపర్తి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు
ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఇప్పటి నుంచి వాతావరణం ఇలాగే కూల్‌గా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో నాలుగు రోజుల్లో ఎండలు బాగా తగ్గుముఖం పడుతాయని చెప్పింది. అయితే రానున్న మూడురోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కేరళలో నైరుతి రుతుపవనాలు తాకడానికి, రాష్ట్రంలో వర్షాలు కురవడానికి ఎలాంటి సంబంధంలేదని చెప్పింది.