మేఘా కృష్ణారెడ్డిని తప్పించేందుకు ప్రకృతిపై నిందలు

మేఘా కృష్ణారెడ్డిని తప్పించేందుకు ప్రకృతిపై నిందలు

ఖైరతాబాద్, వెలుగు: కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ‘మేఘా’ కృష్ణారెడ్డిని రక్షించేందుకు రాష్ట్ర సర్కార్ పెద్దలు క్లౌడ్ బరస్ట్ పేరుతో నాటకాలు ఆడుతున్నరని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్ లో జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా? ప్రకృతి వైపరీత్యమా?’ అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై సైంటిఫిక్ స్టడీ చెయ్యాలని డిమాండ్ చేశారు. భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు నిపుణులతో చర్చించి, ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ నేతలు అన్ని తమకే తెలుసంటూ.. ఇంజనీర్ల మాట వినకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి కాళేశ్వరమే శ్రీరామరక్ష అనడం శుద్ధతప్పు అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్​ల మోటార్లు మునగడంతో వందల కోట్ల నష్టం జరిగిందన్నారు. నష్ట నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ అధ్యయన వేదిక అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పర్యావరణ వేత్త పీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

లక్ష ఎకరాల్లో పంట నష్టం: కోదండరాం

మంచిర్యాల నుంచి భద్రాచలం వరకు గోదావరి నది వెంట లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను అంచనా వెయ్యకుండా, ఇంజినీరింగ్ లోపాలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని తప్పించేందుకు ప్రకృతిపై నిందలు వేస్తున్నారని అన్నారు. పంప్​హౌస్​ల మునకపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్ క్లౌడ్​బరస్ట్ అంటూ నాటకాలు అడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్​రాష్ట్రంలో ఇంజినీర్, ఆర్థిక వేత్త, డాక్టర్ అన్నీ తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్ రంగారెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం పంపుల మునకకు కారణాలను విశ్లేషించడానికి నిజనిర్ధారణ కమిటీ వేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర సర్కార్, ఇంజినీంగ్ తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మాణం పేరిట మేఘా కృష్ణారెడ్డి రూ.వేల కోట్లు కొల్లగొట్టాడన్నారు. ఇందులో సీఎం కేసీఆర్​కు వాటా 
ఉందని ఆరోపించారు.