రైళ్లు మరింత వేగంతో పరుగెత్త నున్నాయ్

రైళ్లు మరింత వేగంతో పరుగెత్త నున్నాయ్

సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్​ డివిజన్ల పరిధిలో గంటకు 130 కి.మీ స్పీడ్​

సికింద్రాబాద్, వెలుగు: రైళ్లు మరింత వేగంతో పరుగెత్త నున్నాయి. దక్షిణ మధ్య  రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌‌‌‌, విజయవాడ, గుంతకల్‌‌‌‌ డివిజన్ల పరిధిలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను సోమవారం ప్రారంభించారు. దీంతో ఆ డివిజన్ల పరిధిలో రైళ్ల వేగంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌‌‌‌ మరో మైలురాయిని అధిగమించింది. ఈ సెక్షన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసిన అధికారులు ఇప్పటివరకు ఉన్న రైళ్ల వేగాన్ని గంటకు 110 కి.మీల నుంచి 130 కి.మీకు పెంచారు. ట్రాక్ లను  మరింత పటిష్టం చేసిన మార్గాల్లో మాత్రమే ఈ రైళ్లు నడుపుతారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్-– కాజీపేట-– బల్లార్ష, కాజీపేట– కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్ పరిధిలోని కొండ పల్లి–-విజయవాడ– -గూడూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని రేణిగుంట– గుంతకల్-, వాడి సెక్షన్  పరిధిలో ఈ వేగాన్ని అనుమతించారు. ఈ మార్గాలు రద్దీగా ఉండడంతో రైళ్ల వేగాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతానికి వేగం పెంచిన రైళ్లు ఇవే.. 

ప్రస్తుతం ప్రీమియం రైలుగా ఉన్న రాజధాని, దురంతో ఎక్స్​ప్రెస్  రైళ్ల వేగాన్ని ఏప్రిల్​లోనే  గంటకు 130 కిలోమీటర్లకు పెంచారు. సాధారణ ఎక్స్​ప్రెస్​ రైళ్లు ఇప్పటిదాకా 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఇప్పుడవన్నీ ఆయా రూట్లలో 130 కి.మీ వేగంతో దూసుకుపోతున్నాయి. గూడ్స్ రైళ్లల్లో కూడా వ్యాగన్ల  రకాన్ని బట్టి వేగంలో మార్పులు చేశారు. కొన్ని గూడ్స్​ రైళ్లు 120 కి.మీ వేగంతో, మరికొన్ని 100 కి.మీ, ఇంకొన్ని 80 కి.మీ వేగంతో వెళ్తున్నాయి. స్వర్ణచతుర్భుజి, స్వర్ణవికర్ణ మార్గాలే కాకుండా మరికొన్ని కారిడార్లలో కూడా రైళ్లను 130 కి.మీ వేగంతో నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.