నిండుకుండలా శ్రీశైలం

నిండుకుండలా శ్రీశైలం

హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కర్నాటకలో పడుతున్న వానలకు ప్రాజెక్టు శుక్రవారం నాటికి పూర్తిగా నిండనుంది. ఐదు రోజులతో పోల్చితే బుధవారం ఇన్ ఫ్లో కాస్త తగ్గింది. 215.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ లో నీటి నిల్వ బుధవారం రాత్రి 8 గంటల వరకు 180 టీఎంసీకు చేరింది. తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలంలోకి 2.32 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ లో కరెంట్ ఉత్పత్తి చేస్తూ 29 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ లోకి 26 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 312.05 టీఎంసీల కెపాసిటీ గల సాగర్ లో నీటినిల్వ 173.66 టీఎంసీలకు చేరింది. గోదావరి శాంతిస్తోంది. ఎస్సారెస్పీకి 19 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వరద కాలువ నుంచి మిడ్ మానేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి 1.88 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 2.37 లక్షల క్యూసెక్కులు గోదావరిలో కి వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి నుంచి లక్షన్నర, ప్రాణహిత 6.80 లక్షలు కలిపి 8.62 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే నీటిని కిందికి వదిలేస్తున్నారు.