
- ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి 3 లక్షలు,
- తుంగభద్ర నుంచి 1.58 లక్షల క్యూసెక్కులు రిలీజ్
- మరో నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్ నిండే చాన్స్
హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద భారీగా వస్తోంది. సీజన్‌లో తొలిసారిగా నాలుగు లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వచ్చింది. జూరాలతో పాటు సుంకేసుల, తుంగభద్ర నుంచీ నీటిని భారీగా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 4,12,280 క్యూసెక్కుల వరద వస్తుండగా 74,258 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 866.40 అడుగుల మేరకు నీరు చేరుకుంది. నీటి నిల్వ 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి నుంచి మూడు లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 3,00,064 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 3.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3,16,308 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,58,457 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. భారీగా వరద పోటెత్తుతుండడంతో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరదపోటు ఇలాగే కొనసాగితే రెండు, మూడు రోజుల్లో నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. పైనుంచి భారీగా వరద ప్రవాహాలు కొనసాగుతుండడంతో ఆల్మట్టిలో సగం ఖాళీ ఉండగానే గేట్లను తెరిచి వరదను విడుదల చేస్తుండడం గమనార్హం. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 77.05 టీఎంసీల స్టోరేజీ ఉంది.
మేడిగడ్డ వద్ద కాస్త తగ్గిన వరద
గోదావరి బేసిన్‌లో వరద ఉధృతి కొనసాగుతున్నా.. మేడిగడ్డ వద్ద మాత్రం కొంత తగ్గింది. రెండు రోజుల కిందటి వరకు మేడిగడ్డ దగ్గర దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా శనివారం 5,39,200 క్యూసెక్కులకు పడిపోయింది. అదే సమయంలో సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్వద్ద మాత్రం భారీగా నమోదవుతోంది. సమ్మక్కసాగర్ వద్ద 9,75,190 క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 13,95,637 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. భద్రాచలం నుంచి 12,38,709 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా గోదావరి బేసిన్‌లోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా నమోదవుతున్నది. 30,554 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు 12,931 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ప్లో వస్తుండగా అంతే వరదను లిఫ్ట్ ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 20.175 టీఎంసీలకుగానూ 17.40 టీఎంసీల స్టోరేజీ ఉంది.
ఉత్తరాది జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మేడారంలో 5.9, వాజేడులో 5.9, మంగపేటలో 4.7, ఆలుబాకలో 4.7, జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా పెద్దంపేటలో 4.4, భూపాలపల్లిలో 4.2, మల్లారంలో 4.1, తాడిచర్లలో 4, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 3.9, ఆదిలాబాద్‌లో 3.9, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 3.5, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.