మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ

మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ
  • డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, గొర్రెల పంపిణీపై చర్చ!
  • సొంత జాగ ఉన్నోళ్లకు ఆర్థిక సాయంపై స్పష్టత?
  • తాజా రాజకీయ పరిణామాలపైనా అంతర్గత చర్చ జరిగే చాన్స్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం గురువారం భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో డబుల్​బెడ్రూం ఇండ్ల పంపిణీ, సొంత జాగా ఉన్నోళ్లు ఇండ్లు కట్టుకునేందుకు ఇచ్చే ఆర్థిక సాయం.. తదితరాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. సొంత జాగా ఉంటే ఇళ్లు నిర్మించుకోవడానికి అందించే రూ.3 లక్షల ఆర్థిక సాయం గైడ్​లైన్స్‌‌‌‌పై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. నాలుగేండ్లుగా ఆగిపోయిన గొర్రెల పంపిణీ స్కీమ్​పైనా కేబినెట్‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

గొర్రెల యూనిట్ల కోసం ఎదురుచూపు

దాదాపు మూడున్నర లక్షల మంది గొల్ల, కురుమలు రెండో ఫేజ్‌‌‌‌లో గొర్రెల యూనిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్​సీడీసీ నుంచి లోన్ కూడా అప్రూవల్​ కావడంతో దానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. దళితబంధు పథకం అమలుపైనా మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే ఈ స్కీమ్‌‌‌‌కు రూ.17 వేల కోట్లకు గాను రూ.4 వేల కోట్లు రిలీజ్ చేశారు. వాటిని ఖర్చు చేయకుండా పీడీ అకౌంట్‌‌‌‌లో పెట్టారు. దళితులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో స్కీమ్‌‌‌‌ అమలుకు పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇచ్చే అంశానికి సంబంధించి ఇప్పటికే అన్ని రెడీ అయ్యాయి. పంపిణీపైనా నిర్ణయం తీసుకోనున్నారు. 

ధరణిపై కీలక నిర్ణయాలకు చాన్స్​

ఇది కాకుండా ఇరిగేషన్​లో ప్రాజెక్టులకు సవరించిన అంచనాలు, రెవెన్యూలో ధరణితో పాటు భూముల అమ్మకాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. ఇటీవల ఖాళీ జాగాలపై ప్రభుత్వం వివరాలు తెప్పించుకున్నది. ఎక్కడెక్కడ ఏ మేరకు జాగాలు ఉన్నాయో చూసి.. దానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఎలక్షన్ ఏడాది కావడంతో కొన్ని స్కీమ్‌‌‌‌లను పట్టాలు ఎక్కించే పనిలో భాగంగానే కీలక అంశాలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనా మంత్రివర్గం చర్చించనుంది. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, గురువారం విచారణ చేయనుండటంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ఏయే సెగ్మెంట్లలో ఎవరికి వ్యతిరేకత ఉన్నదనే దానిపై అంతర్గతంగా చర్చించనున్నట్లు సమాచారం.