ప్రతిసారీ బడ్జెట్ లో హెల్త్​ సెక్టార్ కు తగ్గుతున్న నిధులు

ప్రతిసారీ  బడ్జెట్ లో హెల్త్​  సెక్టార్ కు తగ్గుతున్న నిధులు


హైదరాబాద్, వెలుగు: హెల్త్ సెక్టార్‌‌కు రాష్ట్ర సర్కార్  అస్సలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో సరిపెడుతోంది. హైదరాబాద్‌కు నాలుగు దిక్కులా నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్​.. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఆ హామీని అమలు చేయలేదు. ‘‘ఈ సంవత్సరం ముగిసేనాటికి ప్రతి జిల్లాలో సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ తెచ్చి తీరుతామని నేను వాగ్దానం చేస్తున్న. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లను అద్భుతంగా చేస్తం. నిమ్స్​లో కూడా కొంత గ్యాప్​ ఉంది. అవి కూడా పరిశీలించి సత్వరం చర్యలు తీసుకుంటం. వీటన్నింటి ఇంప్రూవ్​మెంట్​ ఈ సంవత్సరంలో మీకు గణనీయంగా కనిపిస్తది” అని 2015లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా అదే మాట రిపీట్ చేశారు. కానీ, ఇచ్చిన హామీల్లో ఏదీ అమలు కాలేదు. 

కరోనా ఫస్ట్‌‌ వేవ్‌‌లో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌ను హాస్పిటల్‌‌గా మార్చిన రాష్ట్ర సర్కార్.. ఢిల్లీలోని ఎయిమ్స్‌‌ తరహాలో దాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. టిమ్స్‌‌కు రూ. వెయ్యి కోట్లు కేటాయించి గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్ల​ కంటే పెద్ద దవాఖానగా తీర్చుదిద్దుతామని సీఎం కేసీఆర్  నాలుగైదుసార్లు అన్నారు. కానీ, ఇప్పటికీ అందులో కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లను కార్పొరేట్ తరహాలో మారుస్తామని, నిమ్స్‌‌ను మస్తుగ డెవలప్‌‌ చేస్తామన్న హామీలన్నీ  ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే అధ్వాన్నంగా నిమ్స్ తయారైంది. గాంధీ, ఉస్మానియాలో ఆపరేషన్​ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేవు. వాటిల్లో ఎంఆర్‌‌‌‌ఐ, సీటీ స్కాన్లు పనిచేస్తలేవు. గుండె చికిత్సలకు అవసరమయ్యే క్యాథల్యాబులు మూలకు పడ్డాయి. ఇవేవీ సర్కార్ పట్టించుకుంటలేదని డాక్టర్లు అంటున్నారు. 

బడ్జెట్​లో కేటాయింపులు అంతంతే

కరోనా వచ్చిన తర్వాత హెల్త్ సెక్టార్‌‌‌‌కు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని అందరూ ఆశించినప్పటికీ రాష్ట్ర సర్కార్ మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈసారి(2021-–22)  మొత్తం బడ్జెట్‌‌లో కనీసం ఏడు శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలని డాక్టర్లు డిమాండ్‌‌ చేశారు. కానీ, రాష్ట్ర సర్కార్ 2.75 శాతం నిధులనే హెల్త్‌‌కు కేటాయించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు మహారాష్ట్రలో 4.3 శాతం, కేరళలో 5.6 శాతం, కర్నాటకలో 4 శాతం, ఒడిశాలో 5.55 శాతం బడ్జెట్​ను  హెల్త్‌‌ సెక్టార్ కు కేటాయించారు. అత్యధికంగా మేఘలయా గవర్నమెంట్ 7.4 శాతం నిధులను హెల్త్  సెక్టార్‌‌‌‌ కోసం ఖర్చు చేస్తోంది. మన సర్కార్ కేటాయిస్తున్నదే అత్యంత తక్కువ కాగా.. అందులో ఖర్చు చేసేది ఇంకా తక్కువగా ఉంటోంది. ఈసారి బడ్జెట్‌‌ రూ. 6,295 కోట్లు కేటాయించారు. ఇందులో డాక్టర్లు, స్టాఫ్​ జీతాలు పోను, రూ. 2,411 కోట్లు మాత్రమే ప్రగతి పద్దు కావడం గమనార్హం. ఇందులోనూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మ్యాచింగ్ గ్రాంటుకే రూ.1,200 కోట్ల దాకా కేటాయించారు. ఇక మిగిలేది రూ. 1,211 కోట్లే. వీటిని ఇప్పటికే శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి, మెడిసిన్‌‌ కోసం, ఇతరత్ర సివిల్​ వర్క్స్​, ఎక్విప్​మెంట్​ కొనుగోలు కోసం వినియోగించాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా హెల్త్​ సెక్టార్​కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా కేటాయింపులు జరపలేదు.  దీన్ని బట్టి రాష్ట్ర సర్కార్ హెల్త్‌‌కు ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

డాక్టర్లు, స్టాఫ్ కొరత

హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో 23 వేల ఖాళీలు ఉన్నట్టు ఇటీవల పీఆర్సీ కమిటీ నివేదికలో పేర్కొంది. ఇందులో సుమారు పదివేలకు పైగా పోస్టులు నర్సింగ్‌‌వే ఉన్నాయి. డాక్టర్ల పోస్టులు ఏడెనిమిది వేలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కరోనాతో దవాఖాన్లలో పేషెంట్ల సంఖ్య పెరిగి, ఆ ప్రభావం హెల్త్ స్టాఫ్‌‌పై, ట్రీట్‌‌మెంట్‌‌పై పడుతోంది. దీంతో హడావుడిగా టెంపరరీ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు. కానీ, డాక్టర్లు ఎవరూ ఈ టెంపరరీ జాబ్​లు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తలేరు. పైగా శాలరీ కూడా నామమాత్రంగా ఇస్తున్నారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే హెల్త్ స్టాఫ్‌‌కు మన దగ్గరే తక్కువ జీతాలు ఉన్నాయి. నర్సింగ్ స్టాఫ్‌‌కు కనీసం రూ. 21 వేల శాలరీ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్ ఇచ్చినా, మన రాష్ట్రంలో ఆ ఆదేశాలు అమలు చేయడం లేదు. ప్రైవేట్ హాస్పిటళ్లలో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం లేదు.