సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్‌.. అప్రమత్తమైన పోలీసులు

సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్‌..  అప్రమత్తమైన పోలీసులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని మావోయిస్ట్‌‌ ప్రభావిత జిల్లాల్లో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనధికార రెడ్‌‌ అలర్ట్‌‌ ప్రకటించింది. తెలంగాణకు సమీపంలోని చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రం కాంకేర్‌‌ సమీప అటవీ ప్రాంతంలో మంగళవారం భారీ ఎన్‌‌కౌంటర్‌‌ జరగడంతో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో చత్తీస్‌‌గఢ్‌‌, మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ జిల్లాల పోలీసులు అలర్ట్‌‌ అయ్యారు. పార్లమెంట్‌‌ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు, యాక్షన్‌‌ టీంలు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. దీంతో పోలీసులు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రత్యేక బలగాల సాయంతో అడవులను జల్లెడ పడుతున్నారు. దండకారణ్యంతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌‌ జిల్లాల పోలీసులు ప్రత్యేక బలగాలతో అడవుల్లో కూంబింగ్‌‌ నిర్వహిస్తున్నారు.

రంగంలోకి యాక్షన్‌‌ టీంలు

ఎన్నికలకు ముందు ఏదైనా హల్‌‌చల్‌‌ సృష్టించే లక్ష్యంతో యాక్షన్‌‌ టీంలు తెలంగాణలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రత్యేక నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ సమీపంలోని చత్తీస్‌‌గఢ్‌‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఎన్‌‌కౌంటర్‌‌ జరిగిందన్న ప్రచారం సాగుతోంది. భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల నుంచి మావోయిస్ట్‌‌ యాక్షన్‌‌ టీంలు తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారంతో పోలీసులు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్‌‌ చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేలా చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపూర్, వాజేడు ప్రాంతాలకు చెందిన పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ – ఛత్తీస్‌‌గఢ్‌‌ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఏజెన్సీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొంపముంచిన షెల్టర్‌‌జోన్‌‌

ఓ వైపు లోక్‌‌సభ ఎన్నికలు, మరో వైపు మండుతున్న ఎండలు మావోయిస్టులకు కలిసి రావడం లేదు. చత్తీస్‌‌గఢ్‌‌లోని మావోయిస్టులకు కంచుకోటైన బస్తర్‌‌ రీజియన్‌‌లో శుక్రవారం మొదటి దశ ఎన్నికలు జరుగగా, 26న రెండో దశ ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు ఆ దిశగా తమ కార్యాచరణను అమలుపర్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమైనట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇదిలాఉండగా ఎండాకాలంలో మావోయిస్టులు షెల్టర్‌‌జోన్‌‌గా భావించే ప్రాంతాలపై బలగాలు నిఘా పెట్టాయి. పక్కా ఇన్‌‌ఫార్మర్‌‌ వ్యవస్థతో కాంకేర్‌‌ సమీపంలోని బినాగూడ, చోటా బేటియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మీటింగ్‌‌ పెట్టుకున్నారన్న సమాచారం నిఘా వర్గాలకు లీక్‌‌ అయింది. ఈ విషయాన్ని గుర్తించని మావోయిస్టులను పోలీసులు, ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. భారీగా సాగిన 
ఈ ఎన్‌‌కౌంటర్‌‌లో 29 మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో కీలక బాధ్యతల్లో ఉన్న నలుగురైదుగురు ఉండడంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది. ‌

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

లోక్‌‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 18 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా, వచ్చే నెల 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల టైంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్‌‌రాజు ఏపీ, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసులతో ఎప్పటికప్పుడు మీటింగ్‌‌లు పెడుతున్నారు. ఎన్‌‌కౌంటర్‌‌ నేపథ్యంలో పరిస్థితిని ఓఎస్డీ టి. సాయిమనోహర్‌‌తో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు బేస్‌‌ క్యాంప్‌‌లతో పాటు అంతర్రాష్ట్ర చెక్‌‌పోస్టులను ఏర్పాటు చేసి మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా అడ్డుకునే పనిలో ఉన్నారు. వరుస ఎన్‌‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్ట్‌‌ హిట్‌‌ లిస్ట్‌‌లో ఉన్న వారితో పాటు ముఖ్య లీడర్లు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఏజెన్సీ ఏరియాల్లో ఉండొద్దని, తమకు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీ ఏరియాల్లో తిరగొద్దని సూచిస్తున్నారు.