మద్దతు ధరకు కొనలేకే మక్కలు వద్దంటున్రు

మద్దతు ధరకు కొనలేకే మక్కలు వద్దంటున్రు
  •     కేంద్రం కొనే పంటలపైనే రాష్ట్ర సర్కారు మొగ్గు
  •     యాసంగికి కూడా మక్కలు వద్దని సర్కారు నిర్ణయం?
  •     త్వరలో వరిపైనా ఆంక్షలు పెడ్తరేమోనంటున్న ఎక్స్‌‌‌‌పర్టులు

హైదరాబాద్‌‌, వెలుగు: కనీస మద్దతు ధరతో పంటలు కొనలేకే షరతుల సాగు పేరుతో రైతులను రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కేంద్రం కొనుగోలు చేసే పంటలవైపే మొగ్గు చూపుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే వానాకాలంలో మక్కలు వద్దన్న సర్కారు.. యాసంగికి కూడా వేయొద్దని నిర్ణయించిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంఎస్‌‌పీతో పంటలు కొని, వాటిని ప్రాసెస్‌‌ చేసి అమ్ముకునే అవకాశాలు ఉన్నా ఆవైపు దృష్టి పెట్టడం లేదన్న కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మక్కలను కట్టడి చేస్తున్న సర్కారు.. భవిష్యత్తులో వరిపంటపై కూడా ఆంక్షలు పెట్టే అవకాశం ఉందని అగ్రికల్చర్ ఎక్స్ పర్టులు చెబుతున్నారు.

పత్తికి సీసీఐ

ఏటా దేశవ్యాప్తంగా పండించే పంటలకు సంబంధించి మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. పత్తి, వరి, కంది తదితర పంటలకు ఎంఎస్పీ నిర్ణయిస్తుంది. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు పంటలు కొంటాయి. అయితే కేంద్రం కొనుగోలు చేసే పంటలను మాత్రమే కొనాలనే దిశగా రాష్ట్రంలో నిర్ణయాలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వానాకాలంలో షరతుల సాగులో భాగంగా పత్తి ఎక్కువగా సాగు చేయాలని సర్కారు సూచించింది. దీంతో రాష్ట్రంలో 60.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు చేస్తుంది. ఒకవేళ కొనుగోళ్ల విషయంలో సమస్య వచ్చినా తప్పు కేంద్రంపై తోసేసి చేతులు దులుపుకోవచ్చనే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.

వరికి… సబ్సిడీ, ఎఫ్‌‌సీఐ కొనుగోళ్లు

ఇక వరి విషయానికి వస్తే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వడ్లను సేకరించి బియ్యంగా మార్చే బాధ్యతను మిల్లర్లకు రాష్ట్ర సర్కారు అప్పగిస్తుంది. రాష్ట్రంలో కోటి టన్నుల దిగుబడి వచ్చినా ఏటా 70 లక్షల టన్నుల వరకు సేకరించి ఆపై కొనుగోళ్లు ఆపేయడం ఆనవాయితీగా వస్తోంది. సేకరించిన ధాన్యంలో రాష్ట్ర అవసరాలకు దాదాపు 40 లక్షల టన్నులు బియ్యం పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌‌ రూపంలో పంపిణీ చేస్తుంది. దీనికి కేంద్ర సాయం అందుతుంది. కిలో బియ్యం రూ.32 చొప్పున కేంద్రం సేకరించి వాటిని రూ.29 సబ్సిడీతో రాష్ట్రానికి అందిస్తుంది. మిగిలిన రూ.3లో రూ.2 రాష్ట్రం భరించి ఒక్క రూపాయికి రేషన్‌‌ వినియోగదారులకు అందిస్తుంది. మిగిలిపోయిన బియ్యం నిల్వలను ఎఫ్‌‌సీఐకి అమ్మేస్తుంది. బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖకు రుణాలు అందిస్తుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. సివిల్‌‌ సప్లయ్స్‌‌ ద్వారా, ఎఫ్‌‌సీఐ ద్వారా రెండు రకాలుగా కేంద్రం నుంచి భరోసా ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి వరిపై పెద్దగా ఆంక్షలు లేవు. పప్పు ధాన్యాల సాగు అంతంత మాత్రమే. ఎంత ఎక్కువ వేసినా నష్టం లేదు. ఎక్కువైతే కొనడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌‌ ఉంది. గత సీజన్‌‌లో లక్షలన్నర టన్నుల వరకు కొనడానికి నాఫెడ్‌‌ ముందుకు వచ్చింది. అందుకే ఈ పంటలకే రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తోంది.

ప్రాసెస్‌‌ చేస్తే మక్కలకు మంచి డిమాండ్‌‌

మొక్కజొన్న పంటను ప్రాసెస్‌‌ చేస్తే మంచి డిమాండ్‌‌ ఉంటుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. పశువులు, కోళ్లు, చేపలకు దాణాగా, బిస్కెట్లు, బేకరీ పదార్థాల తయారీలో వాడుతున్నారు. మొక్కజొన్న గింజల నుంచి స్టార్చ్, గ్లూకోజ్, సుక్రోజ్, గమ్స్ తదితరాలు తయారు చేస్తారు. మక్కల నుంచి ఆల్కాహాల్, ఇథనాల్‌‌ వంటి కెమికల్స్ కూడా తయారు చేస్తారు. పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తోపాటు లేత బేబీకార్న్ తో కూరలు చేసుకుంటారు. మక్కల నుంచి తీసే నూనెలో కొలేస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. సూప్ మిక్స్, ఇన్​స్టంట్ కార్న్‌‌పఫ్స్, ఉప్మామిక్స్, కేసర్ బాత్ ఇలా ఎన్నో స్నాక్స్‌‌ తయారు చేయచ్చు. మందుల తయారీలోను మక్కలను వాడుతున్నారు. చాలా చోట్ల విస్కీ, బీరు తయారు చేస్తారు. పారిశ్రామిక ఉత్పత్తుల్లోనూ మొక్కజొన్న ఉపయోగపడుతున్నది. కానీ ఆరేళ్లుగా ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టకుండా.. గుడ్డిగా మక్కలు వేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని అఖిల భారత కిసాన్‌‌ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆరోపించారు.

కొన్నవి అమ్మలేక.. కొత్తగా కొనలేక

మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ లో అవినీతి అధికారుల మాయాజాలంతో మక్కలపై ఏటా నష్టం వస్తోంది. గత 4 సీజన్లలో రూ.533 కోట్లకు పైగా నష్టం వచ్చింది. గత యాసంగిలో 9.42 లక్షల టన్నులు కొన్నది. ఇప్పటికీ పూర్తిగా అమ్మలేదు. అమ్మినవీ చాలా తక్కువకు కట్టబెట్టారు. రాష్ట్రంలో మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 14 లక్షల నుంచి 17 లక్షల ఎకరాలు ఉండేది. ఉత్పత్తి 16 లక్షల నుంచి 27 లక్షల టన్నుల వరకు వచ్చేది. ఈ ఏడాది సర్కారు ఆంక్షలతో వానాకాలంలో సాగు పడిపోయింది. 2.25 లక్షల ఎకరాల్లో వేశారు. 7.65 లక్షల టన్నుల దిగుబడి వచ్చే చాన్స్‌‌ ఉంది. యాసంగిలో వచ్చిన మక్కలు అమ్మలేక, ఈ వానాకాలంలో కొనలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకే యాసంగిలోనూ వేయొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది.