ఎడ్యుకేషన్​కు ఏం పెంచలే

ఎడ్యుకేషన్​కు ఏం పెంచలే

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్​ఈ సారి కూడా బడ్జెట్​లో విద్యారంగానికి నామమాత్రపు నిధులు కేటాయించింది. 2023–24 బడ్జెట్లో రూ.19,093 కోట్లు ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే రూ.3050 కోట్ల పెరిగినా, పలు శాఖల్లో నిధులకు భారీగా కోతపడింది. దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్​లో రూ.16,092 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ కు రూ.3,001కోట్లు కేటాయించారు. అయితే గతేడాది బడ్జెట్​తో పోలిస్తే ఈ సారి 0.31శాతం మాత్రమే పెరిగింది. ఈ ఏడాది కొత్తగా యూనివర్సిటీల డెవలప్ మెంట్ కోసం రూ.500 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్​లో లాగే ఈసారి కూడా మహిళా వర్సిటీకి రూ.వంద కోట్లు ప్రతిపాదించింది. కానీ గతేడాది ఒక్క పైసా ఇవ్వలేదు. మరోపక్క బడుల్లో సౌలత్​ల కోసం తీసుకొచ్చిన ‘‘మనఊరు–మనబడి’’ స్కీమ్ కు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ప్రణాళికేతర నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

మోడల్ స్కూళ్లకు రూ.10 కోట్లు

స్కూల్ ఎడ్యుకేషన్ కు ఈ ఏడాది రూ.16,092 కోట్లు ప్రతిపాదించగా, దీంట్లో నిర్వహణ పద్దు రూ.14,166 కోట్లుండగా, ప్రగతిపద్దు కేవలం రూ.1883 కోట్లు పెట్టారు. అందరికీ విద్య అనే అంశానికి గతేడాది రూ.60.91 కోట్లు ప్రతిపాదించగా, ఈ ఏడాది కేవలం రూ.6.78 కోట్లు చూపించారు. దీంట్లో ప్రగతి పద్దు కింద సమగ్ర శిక్షకు రూ.1100 కోట్లు, సొసైటీ గురుకులాలకు రూ.75.94 కోట్లు, అడల్డ్ ఎడ్యుకేషన్​ కు కోటీ, స్కూల్ గేమ్స్ కోసం రూ.7 కోట్లు, అమ్మాయిలకు హెల్త్ అండ్ హైజినిక్ కిట్స్ కు రూ.11.50 కోట్లు, పరీక్షల విభాగానికి రూ.30 కోట్లు, లైబ్రరీలకు రూ.63లక్షలు, మోడల్ స్కూళ్లకు రూ.10.06 కోట్లు ప్రతిపాదించారు.

బాసర ట్రిపుల్​ ఐటీకి రూ.20 కోట్లు

హయ్యర్ ఎడ్యుకేషన్ కు ఈసారి బడ్జెట్​లో  రూ.1886 కోట్లు నిర్వహణ పద్దు కింద ఉండగా, రూ.655.48 కోట్లు ప్రగతిపద్దు కింద పెట్టారు. అయితే ఇంటర్మీడియెట్, కాలేజెట్ ఎడ్యుకేషన్​ లకు బడ్జెట్ లో కోతపెట్టారు. కాలేజెట్ ఎడ్యేకేషన్​కు గతేడాది రూ.62.47 కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ.42.34 కోట్లు ప్రతిపాదించారు. ఇంటర్ ఎడ్యుకేషన్​ కు గతేడాది రూ.34.60 కోట్లు అలాట్ చేస్తే, ఈసారి  రూ.13.13 కోట్లు మాత్రమే పెట్టారు. ప్రగతిపద్దు కింద సర్కారు డిగ్రీ కాలేజీలకు, స్కిల్ నాలెడ్జ్ సెంటర్లకు పైసా ఇవ్వలేదు. ఇంటర్​లో గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల భవనాల నిర్మాణానికి, అడిషనల్ క్లాస్ రూములకు నిధులు ఇవ్వలేదు. టెక్నికల్ ఎడ్యుకేషన్​కు ఈసారి నిధులు పెంచారు. ప్రగతిపద్దు కింద గతేడాది రూ.15.88 కోట్లు ప్రతిపాదిస్తే.. ఈసారి రూ.37.32 కోట్లు ప్రతిపాదించారు. దీంట్లో ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ)కు రూ.20 కోట్లున్నాయి. పాలిటెక్నిక్ లకు ఒక కోటి రూపాయలు కేటాయించారు.

ఇంటర్, డిగ్రీకి మిడ్​డే మీల్స్ లేనట్టే

రాష్ట్రంలోని సర్కారు జూనియర్, డిగ్రీ కాలేజీల స్టూడెంట్లకు మిడ్​డే మీల్స్ పెడ్తామన్న సీఎం కేసీఆర్ హామీకి ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. 2018లోనే దీనిపై ప్రత్యేకంగా కేబినేట్ సబ్ కమిటీ వేసిశారు. మూడేండ్ల కింద అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2020–21 నుంచే అమలు చేస్తామనీ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఎన్నికల ఇయర్ కావడంతో ఈ ఏడాది బడ్జెట్​లో నిధులు కేటాయిస్తారనీ అంతా భావించినా, ప్రభుత్వం మరోసారి స్టూడెంట్లకు మొండిచేయి చూపించింది. 

మహిళా వర్సిటీకి వందకోట్లు కేటాయించినా రిలీజ్​ చేయలే

వర్సిటీల డెవలప్​ మెంట్​కు ప్రత్యేకం గా రూ.500 కోట్లు కేటాయించారు. వీటిని కాలేజెట్ ఎడ్యుకేషన్​లో చూ పించారు. ఏ వర్సిటీకి ఎంత మొత్తం ఇస్తారనే అంశాన్ని బడ్జెట్​లో పెట్టలేదు. మరోపక్క మహిళా యూనివర్సిటీకి ప్రత్యేకంగా రూ.వందకోట్లు బడ్జెట్​లో ప్రతిపాదించారు. గతేడాది కూడా బడ్జెట్​లో వంద కోట్లు పెట్టినా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.