దళిత బంధుకు ఉపాధి నిధులు వాడొద్దు

దళిత బంధుకు ఉపాధి నిధులు వాడొద్దు

హైదరాబాద్, వెలుగు:దళిత బంధు స్కీంకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) నిధులు వాడొద్దని రాష్ట్ర సర్కార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కింద చేపట్టిన అనేక పనులకు ఈజీఎస్ నిధులను రాష్ట్రం వాడుకుంటోంది. రైతు వేదికల నిర్మాణాల్లోనూ ఉపాధి నిధులు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులను వాడుకుంటూ.. కనీసం ప్రధాన మంత్రి ఫొటో పెట్టట్లేదని... ఎన్ని నిధులు వాడుకున్నారో కూడా చెప్పడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ గొప్పగా చేపట్టామని చెబుతున్న దళిత బంధుకు ఉపాధి నిధులు వాడుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని గుర్తించినట్లు తెలిసింది. అయితే విషయం బయటకు రావడంతో ఉపాధి నిధులు వాడుకోరాదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల నుంచే ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 

ఉపాధి హామీ పథకం కింద నిధులను షెడ్ల నిర్మాణం, ఇతరత్రా కొన్నింటికి వాడుకునే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుకు ఉపాధి నిధుల లింక్ పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై ‘వెలుగు’లో  ‘దళిత బంధుకు ఉపాధి హామీ నిధులు’ హెడ్డింగ్​తో ఈ నెల 30న వార్త వచ్చింది. దీనిపై స్పందించిన రాష్ట్రం ఉపాధి నిధులు వాడొద్దని నిర్ణయించింది.

నిధుల కరువుతోనేనా !

నిధుల కొరతతోనే దళిత బంధు నిధులు వాడుకోవాలని తొలుత రాష్ట్ర సర్కార్​ నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈజీఎస్ ఫండ్స్​ దేనికి వినియోగం అవుతాయో... ఆ రకంగా వాడుకోవాలని ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. పైలట్ ప్రాజెక్ట్​ కింద అమలవుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే యూనిట్ల గ్రౌండింగ్​లో అమలును మొదలుపెట్టారు. ప్రతి యూనిట్​కు రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిధుల్లో నుంచే లబ్ధిదారుల అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్ చేస్తోంది. ఆ తరువాత ఎక్కడెక్కడ ఉపాధి నిధులతో చేసే పనులు ఉంటాయో వాటిని.. ఉపాధి ఫండ్స్​ నుంచే ఖర్చు చేసినట్లు చూపి ప్రభుత్వ ఖాతాకు మళ్లించుకోవాలని చూసినట్లు తెలిసింది. దళిత బంధు స్కీం అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్లూ ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. 

యూనిట్ల గ్రౌండింగ్ నాలుగు వేలలోపే

2021–22 లో మార్చి 31వ తేదీలోపే దళిత బంధు లబ్ధిదారుల్లో 40 వేల మందికి డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందులో సగం మంది ఖాతాల్లో కూడా నిధులు జమ చేయలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక యూనిట్ల గ్రౌండింగ్ నాలుగు వేల లోపే ఉంది. తొలుత ప్రకటించిన దాని ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన 11,900 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున అందించాల్సి ఉంది. వీటితో హుజూరాబాద్ నియోజకవర్గం​, మరో నాలుగు మండలాలు చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ లలో గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.