Visa News: మీ దగ్గర రూ.23 లక్షలు ఉంటే చాలు.. గోల్డెన్ వీసాతో దుబాయ్‌లో హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు

Visa News: మీ దగ్గర రూ.23 లక్షలు ఉంటే చాలు.. గోల్డెన్ వీసాతో దుబాయ్‌లో హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు

UAE Golden Visa: భారత్ నుంచి చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళుతుంటారు. అక్కడే చాలా మంది స్థిరపడటానికి వీసాలు పొందుతుంటారు. అయితే గతంలో యూఏఈ నుంచి గోల్డెన్ వీసా పొందాలంటే వ్యాపారం చేస్తున్నట్లు ట్రేడ్ లైసెన్స్ లేదా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారతీయుల కోసం ఈ నిబంధనల్లో కీలక మార్పులను యూఏఈ ప్రకటించింది. 

తాజాగా యూఏఈ తన రెసిడెన్సీ ప్రోగ్రామ్ నిబంధనలను మార్పు చేసింది. దీని కారణంగా అనేక వృత్తుల్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఇకపై గోల్డెన్ వీసా పొందటానికి అర్హులుగా మారతారు. గతంలో ఏదైనా రియల్టీ ప్రాపర్టీ లేదా వ్యాపార పెట్టుబడి ఉన్న వ్యక్తులకు గోల్డెన్ వీసాలను అందించగా.. ప్రస్తుతం భారత ప్రజలకు సానుకూలంగా కీలక మార్పులు వచ్చాయి. 

గతంలో యూఏఈ గోల్డెన్ వీసాలను వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, విద్యార్థులకు మాత్రమే పరిమితం కాగా.. ప్రస్తుతం మార్పు చేసిన నిబంధనల ప్రకారం.. శాస్త్రవేత్తలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, స్కూల్ టీచర్లు, ప్రిన్సిపల్స్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ, ఆరోగ్య రంగంలోని నర్సులకు, కంటెంట్ క్రియేటర్లకు, యూట్యూబర్లు, పాడ్ క్యాస్టర్లు, సర్టిఫైడ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్లు, లగ్జరీ యాచెంట్ ఓనర్లకు కూడా గోల్డెన్ వీసాలను అందించాలని నిర్ణయించింది. గతంలో కనీసం రూ.5 కోట్లు పెట్టుబడితో ప్రాపర్టీ లేదీ వ్యాపార పెట్టుబడితో మాత్రమే 10 ఏళ్ల కాలానికి గోల్డెన్ వీసాలను యూఏఈ అందించేది. కానీ ఇప్పుడు ఆ పాలసీని పూర్తిగా తొలగించింది. 

 

దీంతో ఇకపై భారతీయులు యూఏఈ అందించే జీవితకాల రెసిడెన్సీ గోల్డెన్ వీసాలను కేవలం లక్ష దిరామ్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.23లక్షల 30 వేలు చెల్లిస్తే పొందటానికి వీలు కల్పించబడింది. రానున్న మూడు నెలల కాలంలో దాదాపు 5 వేల మంది ఈ తరహా వీసాల కోసం దరఖాస్తు చేయవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిలో భాగంగా దరఖాస్తుదారుని వివరాలను అక్కడి అధికారులు వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే గోల్డెన్ వీసాకు ఆమోదం తెలుపుతారు.