వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌‌, వెలుగు: వాహనదారులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే పెట్రోల్‌‌, డీజిల్‌‌ రేట్లతో అల్లాడుతున్న వెహికల్ ఓనర్లకు రాష్ట్ర సర్కారు రవాణా ట్యాక్స్‌‌ల పేరుతో షాక్ ఇచ్చింది. నాన్‌‌ట్రాన్స్‌‌పోర్ట్‌‌ బండ్లకు లైఫ్‌‌ ట్యాక్స్‌‌ రేట్లను పెంచింది. బండ్లను స్లాబ్‌‌లుగా విభజించి వడ్డించింది. ఒక్కో బండిపై 2 శాతం నుంచి 4 శాతం వరకు పెంచింది. ఇందుకోసం మూడు షెడ్యూళ్లను మార్చారు. మూడు, నాలుగు, ఏడో షెడ్యూల్‌‌ను సవరించారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ సునీల్‌‌ శర్మ జీవో రిలీజ్‌‌ చేశారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ట్యాక్స్‌‌ల ప్రకారం బండి రకాన్ని బట్టి రూ. 3 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా అదనంగా  వసూలు చేయనున్నారు. పెంచిన ట్యాక్స్‌‌లతో సర్కారుకు ఏటా రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కమర్షియల్ బండ్లపైనా క్వార్టర్లీ ట్యాక్స్‌‌ పెంపు, గ్రీన్‌‌ ట్యాక్స్‌‌ విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.   

ఫోర్ వీలర్లకు రూ. 80 వేల దాకా.. 

నాన్‌‌ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో త్రీవీలర్‌‌, ఫోర్‌‌ వీలర్ బండ్ల లైఫ్‌‌ ట్యాక్స్‌‌ ఇప్పటి దాకా రెండు స్లాబులుగా ఉండగా, దానిని నాలుగు స్లాబులుగా సవరించారు. దీని కిందకు కార్లు, జీపులు, ఆటోలు, 10 సీట్ల ఓమ్నీ బస్‌‌ వస్తాయి. ప్రస్తుతం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉన్న బండ్లకు 12 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల బండ్లకు 14 శాతం లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వేస్తున్నారు. ఇక నుంచి రూ. 5 లక్షల లోపు బండ్లకు 13శాతం, ఐదు నుంచి పది లక్షల మధ్య బండ్లకు14 శాతం, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య బండ్లకు17శాతం, రూ. 20 లక్షల ధర కంటే ఎక్కువగా ఉంటే 18 శాతంగా నిర్ణయించారు. అంటే ఒక్కో బండిపై సుమారుగా రూ. 10 వేల నుంచి రూ. 80 వేల వరకు అదనంగా లైఫ్‌‌ ట్యాక్స్‌‌ కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ. 10 లక్షల బండి తీసుకుంటే 2 శాతం లైఫ్‌‌ ట్యాక్స్‌‌ పెరుగుతుంది. ఈ లెక్కన అదనంగా రూ. 40 వేలు కట్టాలి. ఇక టూవీలర్‌‌, ఫోర్‌‌ వీలర్‌‌ బండ్లు అల్రెడీ ఉండి, మరో బండి కొంటే అదనంగా 2% ట్యాక్స్‌‌ వడ్డించనున్నారు.   

టెన్‌‌ సీటర్‌‌ బండ్లకు రూ. 1.20 లక్షల దాకా..  

కంపెనీలు, సొసైటీలు, ఆర్గనైజేషన్లు సొంతానికి వాడుకునే10  సీట్ల కెపాసిటీ గల వాహనాలను 4 స్లాబులుగా విభజించారు. ఇప్పటి దాకా ఈ బండ్లకు ఒకటే స్లాబ్ ఉండగా, 14% లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వసూలు చేస్తున్నారు. ఇకపై రూ. 5 లక్షలలోపు వాహనానికి 15 శాతం, రూ. 5 నుంచి రూ.10 లక్షల బండ్లకు16 శాతం, రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ధర ఉన్న వెహికల్‌‌కు19 శాతం, రూ. 20 లక్షలకు పైగా ధర ఉంటే 20 శాతం చొప్పున లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వసూలు చేయనున్నారు. అంటే వీటిపై ట్యాక్స్ రూ. 5 వేల నుంచి 1.20లక్షల వరకు అదనంగా పెరగనుంది.  

రూ.50 వేలు దాటే టూవీలర్లకు 12%  

ప్రస్తుతం అన్ని టూవీలర్‌‌లకు ఒకే విధమైన లైఫ్‌‌ ట్యాక్స్‌‌ ఉండగా.. కొత్తగా టూవీలర్లను రెండు స్లాబ్ లుగా విభజించారు. ఇప్పటి దాకా అన్ని రకాల ధరలపై ఒకే స్లాబ్‌‌తో 9 శాతం ట్యాక్స్‌‌ మాత్రమే ఉండేది. ఇక నుంచి రూ. 50 వేల లోపు బండ్లకు 9 శాతంతోనే సరిపెట్టగా.. రూ. 50 వేల కంటే ఎక్కువ ధర ఉన్న టూవీలర్‌‌లపై లైఫ్ ట్యాక్స్ ను12 శాతానికి పెంచారు. ఎక్స్‌‌ షోరూం ధరపై లైఫ్‌‌ ట్యాక్స్‌‌ విధిస్తారు. ప్రస్తుతం దాదాపు అన్ని రకాల బండ్లు రూ. 50 వేలకు పైనే ఉన్నాయి. దీంతో ఒక్కో టూవీలర్‌‌పై అదనంగా రూ. 3 వేలు చెల్లించాల్సి ఉంటుంది.