‘రైట్ టు ప్రైవసీ’ మాడ్యుల్ ను ప్రవేశపెట్టిన సర్కార్

‘రైట్ టు ప్రైవసీ’ మాడ్యుల్ ను ప్రవేశపెట్టిన సర్కార్
  • పట్టా వివరాలు ఇతరులకు కనిపించకుండా చేయొచ్చు 
  •  అక్రమార్కులకే ఉపయోగమంటున్న నిపుణులు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని వ్యవసాయ భూముల వివరాలు తెలుసుకోవాలంటే ధరణి పోర్టల్ పై ఒక క్లిక్ చేస్తే చాలు.. ఎక్కడి నుంచైనా, ఏ ఊరి సమాచారమైనా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఏ సర్వే నంబర్ లోని భూమి.. ఎవరెవరి పేర్లపై ఉందో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ధరణి పోర్టల్ పబ్లిక్ డొమైన్ గా అందుబాటులోకి  వచ్చాక ఎవరి ల్యాండ్ రికార్డులైనా వేరొకరు చూసుకునే అవకాశం కలిగింది. కానీ ఇలా తమ భూముల వివరాలను వేరొకరు చూడడం ఇష్టం లేకుంటే.. ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టుకునే వెసులుబాటును కూడా సర్కార్ కల్పించింది. ఇందుకోసం ‘రైట్ టు ప్రైవసీ’ అనే మాడ్యుల్ ను ధరణి పోర్టల్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది.  

ఇలా దాచుకోవచ్చు.. 

ధరణి పోర్టల్ లో లాగిన్ అయ్యాక 29వ ప్లేస్ లో ఉన్న ‘రైట్ టు ప్రైవసీ’ మాడ్యూల్ పై క్లిక్ చేయాలి. ఇందులో మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి.. పాస్ వర్డ్ స్థానంలో పట్టాదార్ పాస్ బుక్ నంబర్, ఆధార్ కార్డులోని మొదటి నాలుగు అంకెలను ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సర్వే నంబర్లను సెలక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. తహసీల్దార్ కు దరఖాస్తు సమర్పించినా ధరణి పోర్టల్ లో భూముల వివరాలు కనిపించకుండ చేస్తారు. 

అక్రమార్కులకే మేలు? 

గతంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాకాటి కరుణ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన సమయంలో ప్రతి ఊరిలో గోడలపై సర్వే నంబర్ల వారీగా పహాణీలను రాయించారు. దీనివల్ల ఏ భూమి ఎవరిదో తెలుసుకునే అవకాశం కలిగింది. రికార్డుల్లో ఒక పేరుకు బదులు మరొకరి పేరు పడితే వెంటనే తహసీల్దార్ ను కలిసి దరఖాస్తు పెట్టుకుని చాలా మంది సరి చేసుకునేవారు. సరిగ్గా ఇదే పద్ధతిలో ధరణి పోర్టల్ కూడా పబ్లిక్ డొమైన్ గా అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా వారసత్వంగా భూములు కలిగినవాళ్లు, లేదా తక్కువ విస్తీర్ణంలో భూమి కొనుగోలు చేసినవాళ్లకు పెద్దగా భూముల వివరాలను గుట్టుగా దాచుకునే అవసరం ఉండదని, అక్రమార్జన ద్వారా భూములు కొనుగోలు చేసిన వ్యక్తులకే ఈ మాడ్యుల్ ఉపయోగమని నిపుణులు చెప్తున్నరు.