దళితబంధుకు పైసా పెంచలే

దళితబంధుకు పైసా పెంచలే

దళితబంధుకు పైసా పెంచలే
రూ.17,700 కోట్లు ప్రతిపాదించిన సర్కారు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకానికి ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులను పెంచలేదు. గత బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో మాదిరే ఈ ఏడాది కూడా నిధులు కేటాయించింది. రూ.17,700 కోట్లు దళితబంధు కోసం ఖర్చు పెడతామని చెప్పింది. వాస్తవానికి గత ఏడాది బడ్జెట్​లోనూ ఇంతే మొత్తాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర సర్కారు.. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కొచ్చే సరికి భారీగా కోత పెట్టేసింది. రూ.6,700 కోట్లను కట్ చేసి.. రూ.11 వేల కోట్లకు కుదించింది. అందులోనూ పైసా ఖర్చు పెట్టలేదు. నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారుల చొప్పున 118 నియోజకవర్గాల్లో దళితబంధును అమలు చేయనున్నట్టు బడ్జెట్ నోట్‌‌‌‌‌‌‌‌లో సర్కారు వెల్లడించింది. ఆ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 1,29,800 మంది దళితులకే ఆ పథకం అందనుంది. వారికి రూ.12,980 కోట్లు ఖర్చువుతాయని నోట్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం పేర్కొంది. కానీ బడ్జెట్ అంచనాలను మాత్రం రూ.17,700 కోట్లుగా పేర్కొనడం గమనార్హం. 

ఎక్కువగా ఎస్సీలకే

బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఫర్వాలేదనిపించేలా నిధులను కేటాయించింది. ఎస్సీలకు పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి కలిపి రూ.57,293.35 కోట్లు కేటాయించిన సర్కారు.. అందులో ఎస్సీలకే అత్యధికంగా 34,475.75 కోట్ల వాటాను అలకేట్ చేసింది. అంటే సంక్షేమానికి కేటాయించిన పద్దులో ఎస్సీలకే దాదాపు 62 శాతానికిపైగా కేటాయింపులను చేసింది. ఎస్టీలకు రూ.14,388.07 కోట్లు చూపెట్టి న సర్కారు.. రాష్ట్రంలో సగం జనాభా ఉన్న బీసీలకు మాత్రం రూ.6,229.2 కోట్లే కేటాయించింది. బీసీల కు కేటాయించిన పద్దులో రూ.2 వేల కోట్లు కల్యాణలక్ష్మికే పోనున్నాయి. ఎంబీసీ కార్పొరేషన్​కు రూ.300 కోట్లు, నేత కార్మికుల సాయానికి రూ.400 కోట్లు, బీసీ ఆత్మగౌరవ భవనాలకు రూ.90 కోట్లను ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి బడ్జెట్​లో పేర్కొనలేదు. మైనారిటీల సంక్షేమానికి రూ.2,200 కోట్ల పద్దు పెట్టింది.

ఎస్సీలకు సగానికిపైగా దళితబంధుకే

ఎస్సీలకు చేసిన కేటాయింపుల్లో సగానికిపైగా నిధులను సర్కారు దళితబంధుకే కేటాయించడం గమనార్హం. ఎస్సీల కోసం ఈసారి కొత్తగా గవర్నమెంట్ రెసిడెన్షియల్ సెంట్రలైజ్డ్ స్కూల్స్​ను ఏర్పాటు చేస్తామని సర్కారు తెలిపింది. ఆ స్కూల్స్ కోసం రూ.1,136 కోట్లను ప్రతిపాదించింది. ఎస్సీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు నామమాత్రంగా నిధులను అలకేట్ చేసింది. కేవలం రూ.50 లక్షలే ఇస్తున్నట్లు చూపించింది. అట్రాసిటీ ఎదుర్కొన్న దళితులకు న్యాయ సాయం, పరిహారం అందించేందుకు ఒక్కపైసా కూడా బడ్జెట్​లో పెట్టలేదు. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి కలిపి సర్కారు రూ.2,059 కోట్లను బడ్జెట్​లో కేటాయించింది.