
- ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులతో గండం
- రీపేమెంట్లకు బ్యాంకుల ఒత్తిడి
- కిస్తీల చెల్లింపు కోసం ఇతర
- విభాగాల నుంచి నిధుల మళ్లింపు
- కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు ఇయ్యాలని ఇరిగేషన్‌శాఖ సర్క్యులర్
- పరోక్షంగా ప్రజలపై పన్నుల..భారం మోపనున్న విభాగాలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన భారీ అప్పులు తిరిగి చెల్లించేందుకు పరోక్షంగా ప్రజలపై రూ. 65 వేల కోట్ల ట్యాక్స్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాళేశ్వరంతో లబ్ధి పొందే అన్ని విభాగాల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని డిసైడ్ అయింది. దీంతో ఆయా విభాగాలు ప్రజలపై పన్నులు మోపే సూచనలు కనిపిస్తున్నాయి. రూ. 1.17 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అందులో రూ. 58 వేల కోట్లు వివిధ బ్యాంకులు, రుణ సంస్థల నుంచి అప్పుగా తెచ్చింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ పేరుతో కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ లోన్లు తీసుకుంది. కాళేశ్వరం నిర్మాణం పూర్తయి దాదాపు మూడేండ్లు కావస్తున్నది. ఇటీవల వచ్చిన గోదావరి వరదకు కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌజ్‌లు నీట మునిగి పోయాయి. వేల కోట్ల నష్టం వాటిల్లింది. మరోవైపు అప్పుల కిస్తీలు చెల్లించాలని బ్యాంకులు, రుణ సంస్థలు ఒత్తిడి పెంచటంతో ప్రభుత్వం రీపేమెంట్లకు కుస్తీ పడుతున్నది.
రూపాయి లేని కార్పొరేషన్
కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పులపై ఇప్పటివరకు నెలనెలా వడ్డీని ప్రభుత్వం బడ్జెట్ నుంచి చెల్లించింది. రుణ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో పాటు కిస్తీలు కలిపి చెల్లించాలి. ఈ ఏడాది మార్చి 31 నుంచి ప్రాజెక్టు పూర్తి స్థాయి వినియోగంలోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులు, రుణ సంస్థల జాయింట్ కన్సార్టియం మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒప్పందం ప్రకారం జూన్ నుంచి రీపేమెంట్ మొదలుపెట్టాలని బ్యాంకులు అప్పుడే తేల్చిచెప్పాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలు తమకు తెలియజేయాలని కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ కు బ్యాంకుల కన్సార్టియం లేఖ రాసినట్లు సమాచారం. వాస్తవానికి కార్పొరేషన్ ఖాతాలో నిధులు లేకపోవటంతో ప్రభుత్వం ఇతర విభాగాల నుంచి నిధుల వేట మొదలుపెట్టింది.
బెనిఫిట్ సర్క్యులర్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందిన విభాగాలన్నీ కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు బదిలీ చేయాలని ఇరిగేషన్ విభాగం తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డుతో పాటు మిషన్ భగీరథ, ఇండస్ట్రీస్, టూరిజం, ఫిషరీష్ విభాగాల నుంచి నిధులు మళ్లించాలని సూచించింది. తాత్కాలికంగా ఇతర విభాగాల నుంచి నిధులు సర్దుబాటు చేసినా.. కాళేశ్వరం అప్పుల రీ పేమెంట్ చేసేందుకు భవిష్యత్తులో పన్నుల మోత తప్పదని ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నాయి.
అటు కరెంటు బిల్లుల షాక్
కాళేశ్వరం కరెంటు బిల్లులు ఇటీవలే ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. మూడేండ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన 140 టీఎంసీల్లో 70 శాతం నీళ్లు తిరిగి ఎల్లంపల్లి గేట్లు ఎత్తి గోదావరిలోకి విడిచి పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ.. ఈ నీటిని లిఫ్ట్ చేసినందుకు దాదాపు రూ. 3,600 కోట్ల మేరకు కరెంటు బిల్లులు వచ్చాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో బకాయిలు పేరుకుపోయాయి. తమకు రావాల్సిన రూ. 3,100 కోట్ల బిల్లులు చెల్లించాలని ఇటీవలే తెలంగాణ నార్తర్న్, సదరన్ డిస్కంలు ఇరిగేషన్ విభాగానికి లేఖ రాశాయి. అటు బ్యాంకుల కిస్తీలు, ఇటు కరెంటు బిల్లుల భారం.. తడిసి మోపెడు కావటంతో త్వరలోనే ప్రజల నెత్తిన కాళేశ్వరం పన్నుల మోత తప్పదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.
రుణ ఒప్పందంలోనే ప్రస్తావన
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే వాటర్ ట్యాక్స్‌లు, చార్జీల రూపంలో కాళేశ్వరం కార్పొరేషన్‌కు రెవెన్యూ వస్తుందని అప్పులు తీసుకునేటప్పుడు ప్రభుత్వం భారీ అంచనాలు వేసుకుంది. వాటర్ ట్యాక్సులు, చార్జీల రూపంలో దాదాపు రూ. 65,454 కోట్ల రాబడి ఉంటుందని టెక్నో ఎకనమిక్ వయబులిటీ రిపోర్టును బ్యాంకులకు సమర్పించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ప్రాజెక్టు వెంబడి ఉన్న గ్రామాల నుంచి తాగునీటి చార్జీలు, పరిశ్రమల నుంచి వాటర్ ట్యాక్స్ ద్వారా ఈ రాబడి ఉంటుందని ప్రస్తావించింది. దీని ఆధారంగా బ్యాంకులు, రుణ సంస్థలు ప్రభుత్వం అడిగినన్ని అప్పులు ఇచ్చాయి. నిర్మాణం పూర్తయి మూడేండ్లయినా కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు రాలేదు. కార్పొరేషన్‌కు రూపాయి కూడా రాబడి రాలేదు. ఈ టైమ్‌లోనే అప్పులు తిరిగి చెల్లించాలని బ్యాంకులు పట్టుబడుతుండటంతో సర్కారు కాళేశ్వరం ట్యాక్స్ రాబట్టేందుకు రెడీ అవుతున్నది.