సెస్ ఎన్నికలకు రెడీ.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

సెస్ ఎన్నికలకు రెడీ.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
  •     రెండు ప్రతిపాదనలు అందజేత
  •     హైకోర్టు నిర్ణయం 25కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కో–ఆపరేటివ్‌‌ ఎలక్ట్రిక్‌‌ సప్లయ్‌‌ సొసైటీ (సీఈఎస్‌‌ఎస్‌‌) ఎలక్షన్స్‌‌ జరిపేందుకు రెండు షెడ్యూల్స్‌‌ను హైకోర్టుకు రాష్ట్ర సర్కార్‌‌ ప్రతిపాదించింది. ఓటర్​ లిస్ట్‌‌ త్వరగా రెడీ అయితే నవంబర్‌‌ 7న ఎలక్షన్‌‌ నోటిఫికేషన్‌‌ ఇచ్చి అదే నెల 26న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఓటర్ల లిస్ట్‌‌ రెడీ కావడం ఆలస్యమైతే డిసెంబర్‌‌ 6న నోటిఫికేషన్‌‌ రిలీజ్‌‌ చేసి అదే నెల 28న ఎన్నిక జరుపుతామని గవర్నమెంట్‌‌ తరఫున అడిషనల్​ ఏజీ జె.రామచందర్‌‌ రావు చెప్పారు. 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్న సొసైటీకి.. ఎన్నికలు జరపకుండా జీవో 151 ప్రకారం కమిటీని పొడిగించడాన్ని సవాల్‌‌ చేస్తూ.. సొసైటీ మెంబర్‌‌ కనకారావు రిట్‌‌ వేశారు. దీనిపై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం విచారించింది.

ఎలక్షన్స్‌‌ జరపడానికి ఇన్​చార్జ్​ కమిటీని అనుమతించాలని ప్రభుత్వం కోరింది. పిటిషనర్‌‌ తరఫు సీనియర్‌‌ అడ్వొకేట్‌‌ వివేక్‌‌ రెడ్డి వాదిస్తూ.. గవర్నమెంట్‌‌ కనుసన్నల్లోని కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల లిస్ట్‌‌ రెడీ చేస్తే అన్యాయం జరుగుతుందని, మంత్రి చెప్పిన వాళ్లనే కమిటీలో ఉంచారని, ఏకపక్షంగా లిస్ట్‌‌ తయారు చేయకుండా కో–ఆపరేటివ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆధ్వర్యంలో లిస్ట్‌‌ తయారు చేయాలని కోరారు. వాదనల తర్వాత తన నిర్ణయాన్ని 25న ప్రకటిస్తామని చెప్పి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.