సర్కారే కార్మికులతో సమ్మె చేయిస్తోంది

సర్కారే కార్మికులతో సమ్మె చేయిస్తోంది

కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి

న్యూఢిల్లీ, వెలుగు:  సింగరేణి సమ్మె వెనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సర్కారే కార్మికులతో సమ్మె చేయిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి అన్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెపై సోమవారం లోక్​సభలో జీరో అవర్​ సందర్భంగా కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. వేలంపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర మంత్రులు, అధికారులు చర్చించాల్సింది పోయి.. ప్రభుత్వమే సమ్మెకు ప్రోత్సహించి కోల్​ ప్రొడక్షన్​ను బంద్​ పెట్టించడం సరి కాదని అన్నారు. ఈ సమ్మె వల్ల దేశ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని, ఇటు సింగరేణి కాలరీస్​ కంపెనీ లిమిటెడ్​కూ మంచిది కాదని అన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులపై యూపీఏ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, అందుకే ఎలాంటి అక్రమాలకూ చోటు లేకుండా ఇప్పుడు వేలాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. కాగా, తెలంగాణ ప్రజలు 4 కోల్​ బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని అంతకుముందు ఉత్తమ్​ అన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి నేరుగా ఇచ్చేయకుండా వేలం వేయడాన్ని తప్పుబడుతున్నారన్నారు. సమ్మె వల్ల బొగ్గుఉత్పత్తి జరగక రోజూ రూ.120 కోట్ల నష్టం కలుగుతోందని అన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుకు సింగరేణి నుంచే బొగ్గు వెళ్తుందని చెప్పారు. కాబట్టి వెంటనే రాష్ట్రంలోని నాలుగు బ్లాకుల వేలాన్ని ఆపేసి.. సింగరేణికి ఇవ్వాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు.