
కేంద్రం ఫండ్స్‌ను రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తోంది: నిర్మలా సీతారామన్
ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన డీకే అరుణ
రాష్ట్రానికి ఫైనాన్షియల్ సపోర్ట్‌పై చర్చ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం నుంచి తెలంగాణకు అన్నివిధాలా న్యాయం చేస్తున్నామని.. వంద శాతం ఫండ్స్ రిలీజ్ చేశామని కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు ప్రయోజనం కలిగేలా ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చామని, గ్రామీణ సడక్ యోజన స్కీం కింద పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. మంగళవారం బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్డీకే అరుణ ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ పై వారు చర్చించారు. ఆత్మనిర్భర్‌భారత్, ఉపాధి హామీ పథకం పనిదినాల పెంపు ద్వారా రాష్ట్రానికి ఎక్కువ ఫండ్స్ ఇచ్చామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు.
కేంద్రం అమలు చేస్తున్న ఆవాస్ యోజన స్కీం కింద దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు మాత్రం పేదలకు ఎందుకు ఇండ్లు కట్టివ్వడం లేదని.. కేంద్ర నిధులను ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఊర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలు, శ్మశానాలకు ఫండ్స్‌ను కేంద్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. రైతుల సంక్షేమ పథకాల కోసం కేంద్రం ఇస్తున్న ఫండ్స్‌ను రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తోందని ఆరోపించారు. భేటీ తర్వాత ఈ వివరాలను డీకే అరుణ వెల్లడించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.