పేదల భూములతో  సర్కారు ‘ఆట’

పేదల భూములతో  సర్కారు ‘ఆట’

వరంగల్‍, వెలుగు: రాష్ట్ర సర్కారు తెలంగాణ క్రీడా ప్రాంగణాల (టీకేపీ) పేరుతో జిల్లాల్లోని పేదల భూములను మరోసారి లాక్కుంటోంది. గతంలో దళితులకిచ్చిన భూములకు ఎసరు పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 19 వేల గ్రామాలు, 5 వేల వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‍ అధికారులను ఆదేశించారు.  మొత్తంగా 24 వేల గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతిచోట కనీసం ఎకరం జాగా ఉండేలా నిర్మించాలని ఆర్డర్‍ వేశారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి మొత్తం 3,618 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. హైదరాబాద్‍ జీహెచ్‍ఎంసీ పరిధిలో ఒక్కో డివిజన్‍లో 3 చొప్పున.. గ్రేటర్‍, కార్పొరేషన్లలో 2, మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఒకటి చొప్పున ప్లే గ్రౌండ్​ ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రూరల్‍ ఏరియాలో 19,472, సిటీ పరిధిలోని వార్డుల్లో 5,001 టీకేపీలు రెడీ చేసేలా జిల్లాల ఆఫీసర్లు ముందుకు సాగుతున్నారు. అయితే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‍ 2 నాటికి పట్టణ పరిధిలో 510, ప్రతి మండలంలో కనీసం 2 చొప్పున ప్రారంభించేలా చూడాలని చెప్పడంతో.. సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 

భూమి దొరకట్లే

వాకింగ్‍ ట్రాక్, వాలీబాల్‍, ఖోఖో, కబడ్డీ, హైజంప్‍ కోర్టులు.. ఐరన్‍ బార్లతో జిమ్‍ సెంటర్‍ ఏర్పాటుకు పెద్ద జీపీలో ఎకరం, చిన్నవాటిలో కనీసం అర ఎకరం స్థలం సేకరించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, రైతు వేదికలు, శ్మశానవాటికలకు భూసేకరణ చేయడానికే సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. హైదరాబాద్‍ జీహెచ్‍ఎంసీ, వరంగల్‍ జీడబ్ల్యూఎంసీతో పాటు కరీంనగర్‍, ఖమ్మం, నిజామాబాద్‍ వంటి కార్పొరేషన్లలో అధికారులకు, కార్పొరేటర్లకు గ్రౌండ్ల ఏర్పాటు సవాల్‍గా మారింది. డివిజన్లు, వార్డుల పరిధిలో ప్రభుత్వ భూములు రికార్డుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. ఫీల్డ్​మీద చాలావరకు నిర్మాణాలు ఉంటున్నాయి. వాకింగ్‍ ట్రాక్‍ కోసం ఎకరం కాకున్నా కనీసం రెండు వేల గజాలు అవసరం. గ్రేటర్ వరంగల్‍ పరిధిలో నలుగురు సీనియర్‍ ఆఫీసర్లను నియమించి వందలాది సిబ్బందిని ఫీల్డ్ లో పరుగులు పెట్టిస్తే.. 66 డివిజన్లకుగానూ 24 డివిజన్లలో పనులు అవుతున్నాయి. ఇందులో సైతం ఎక్కడా 1000 గజాల కంటే ఎక్కువ స్థలం సేకరించిన దాఖలాలు లేవు. 

చెరువులో ప్లే గ్రౌండ్‍ ఏంటి?

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్​ మండలం రాఘవాపూర్​లో స్థానిక ఊర చెరువు శిఖం భూములను ప్లే గ్రౌండ్‍ కోసం కేటాయించారు. కాగా, స్థానిక ముదిరాజు కులస్థులు ఆఫీసర్లను అడ్డుకున్నారు. ఎన్నో కుటుంబాలకు జీవనాధారమైన చెరువులో గ్రౌండ్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురిని సముదాయించారు. ఎంపీడీవో మాత్రం చెరువులో కేటాయించిన ఎకరం భూమిలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి తీరతామన్నారు.

దళితుడి భూమి తీసుకున్రు 

దళిత బస్తీ పథకం కింద మూడెకరాలు ఇస్తానంటేనే గతంలో తన భూమిని రైతువేదిక నిర్మాణానికి ఇచ్చానని.. ఆ మూడెకరాలు ఇప్పటికీ ఇవ్వకుండా తనకున్న స్థలాన్ని క్రీడా ప్రాంగణానికి తీసుకోవడమేంటని ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామానికి చెందిన దళిత రైతు అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం  స్థల సేకరణకు వెళ్లిన ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగాడు. అయినా.. అది ప్రభుత్వ భూమంటూ అధికారులు చదును చేశారు. బుధవారం సైతం ఎక్కడ పనులను అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు ఆయనతోపాటు కుటుంబసభ్యులను పోలీస్‍ స్టేషన్‍కు తరలించారు.  ఆఫీసర్లు ప్లే గ్రౌండ్​ కోసం తన పట్టా భూమిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడుకు చెందిన దంతోజ నర్సింహాచారి ఆవేదన వ్యక్తం చేశారు.

గొడవలు.. ఆత్మహత్యా యత్నాలు

క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పేరుతో అధికారులు గ్రామాల్లోని దళితులు, సొసైటీలు, దాతల పేర్లతో ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తుండటంతో పలు జిల్లాల్లో గొడవలు అవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్లే గ్రౌండ్ కోసం 119 సర్వే నంబర్​లో క్రీడా మైదానానికి హద్దులు ఏర్పాటు చేస్తున్న అధికారులను సోమవారం గ్రామ దళితులు అడ్డుకున్నారు. గతంలో కాళేశ్వరం, హరిత హోటల్, పోలీస్ స్టేషన్ నిర్మాణాల పేరుతో దళితుల భూమి వాడుకున్న ప్రభుత్వం ఇప్పుడు క్రీడా ప్రాంగణాల పేరుతో తమ నివాసాలకు చిచ్చు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల భారతి అనే మహిళ ఒంటిపై డీజిల్ పోసుకోగా.. లేఖరి రాజయ్య పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యా యత్నం చేశారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరంగల్​ జిల్లా వర్ధన్నపేట ఆకేరు వాగు ఒడ్డునున్న సీతారామచంద్రస్వామి ఆలయం పక్కనున్న స్థలాన్ని 20 ఏళ్ల కింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొన్నారు. ఏటా బతుకమ్మ, రావణవధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఫీసర్లు ఈ స్థలాన్ని ప్లే గ్రౌండ్​కు ఎంపిక చేయడంతో వివాదం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్లే గ్రౌండ్​ వద్దంటూ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు నిరసన తెలిపారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్‍ కమిషనర్‍ రవీందర్‍కు పనులు ఆపాలంటూ వినతిపత్రం అందించారు.
నల్గొండ జిల్లా చండూరు మండలం తేరటుపల్లి గ్రామంలో 7 ఎకరాల 20 గుంటల భూమిని 1992లో అప్పటి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలు 150 మందికి పంపిణీ చేసింది. వసతులు లేవని ఇప్పటివరకు ఎవరూ ఇల్లు కట్టుకో లేదు. ఆ స్థలాన్ని క్రీడా మైదానం కోసం తీసుకునేందుకు వెళ్లిన ఆఫీసర్లను పట్టాదారులు అడ్డుకున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.