లగ్జరీ కార్ల కోసం రూ. 3,200 కోట్ల ఖర్చు

లగ్జరీ కార్ల కోసం రూ. 3,200 కోట్ల ఖర్చు

హైదరాబాద్, వెలుగు: కొత్త వాహనాల కొనుగోలు కోసం రాష్ట్ర సర్కార్ భారీ మొత్తం ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి దాకా రూ. 3,200 కోట్ల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు వివిధ డిపార్ట్ మెంట్ల ఉద్యోగులకు ఇచ్చింది. ఇలా ఏడేండ్లలో 26 వేల కార్లు కొన్నట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు. వీటిలో ఇన్నోవా, ఫార్చునర్, టాటా ఇతియాస్, బొలేరో, కియా కార్నివాల్ వంటి మోడల్స్ 7 వేల వరకు ఉన్నాయి. పోలీస్ శాఖ కోసం ఇన్నోవా, స్కార్పియోలు అధికంగా కొన్నారు. ఇక అడిషనల్ కలెక్టర్లకు ఒక్కోటి రూ. 34 లక్షల విలువైన 32 కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేసి ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్ కోసం రూ. 750 కోట్ల విలువైన కొత్త వెహికిల్స్ కొన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. కార్ల కొనుగోలు కోసమే స్పెషల్ గా రూ. 500 కోట్లు లోన్ తీసుకున్నారు. కొత్త జిల్లాల కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీల కోసం ఫార్చూనర్ కార్లను పర్చేజ్ చేశారు. పాత కార్లు అందుబాటులో ఉన్నా కొత్త కార్లు కొనడంతో అదనపు భారం పడింది. ఆర్డీఓలతో పాటు సీనియర్ అధికారులకు కూడా కొత్త వాహనాలు ఇచ్చారు. మరోవైపు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లోనూ ఉన్నతాధికారులకు కొత్త ఇన్నోవాలు కొనిచ్చారు. ఇక 2018లో 32 మంది జిల్లా పరిషత్ చైర్మన్ లకు ఒక్కోటి రూ. 40 లక్షలు విలువైన ఫార్చూనర్ కార్లను కొనిచ్చారు. సెక్రటేరియట్ లోని అడిషనల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు హోండా సిటీ, టొయోటా కామ్రీ, కొరొల్లా వంటి లగ్జరీ కార్లను వాడుతున్నారు. ఈ వాహనాల కొనుగోలు కోసం జనరల్ ఫండ్ నిధులను ఉపయోగించినట్లు 
రికార్డులు చెప్తున్నాయి.