ప్రజలకు న్యాయం చేసేలా..

ప్రజలకు న్యాయం చేసేలా..

హైదరాబాద్, వెలుగు: జంట జలాశయాలను పరిరక్షించే జీవో 111 స్థానంలో కొత్త నిబంధనల కోసం రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. సుప్రీం ఆదేశాలతో అమల్లోకి వచ్చిన ఈ జీవో స్థానంలో కొత్తది రూపొందించాలంటే నిబంధనలు పకడ్బందీగా ఉండాలి. లేదంటే కోర్టు అభ్యంతరం చెప్పే చాన్స్ ఉంటుంది. అందుకే సుప్రీం, నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యూనల్(ఎన్జీటీ)ను కన్విన్స్​ చేసేలా అధికారులు కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇందుకు ఐఐటీ ఖరగ్​పూర్, ఐఐటీ ఇండోర్​లో పని చేసిన రిటైర్డ్​ సైంటిస్టుల సాయం తీసుకుంటున్నారు. 

శాశ్వత పరిష్కారం చూపించేలా..

జంట జలాశయాలకు ఎలాంటి ఇబ్బందీ లేదనే రీతిలో గ్రామాన్ని ఒక యూనిట్​గా తీసుకొని కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. పాత జీవో ప్రకారం జంట జలాశయాలను యూనిట్​గా తీసుకొని ఎఫ్​టీఎల్​ నుంచి పది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలపై నిబంధనలు విధించారు. తొలుత ఇదే మోడల్​ తీసుకొని పరిధిని కుదిస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని వల్ల జీవోను ఎత్తేసిన ఫలితం ఉండదని, కొన్ని గ్రామాలకు మేలు జరిగితే మరికొన్ని గ్రామాలు అదే సమస్యలతో ఉండిపోతాయనే అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. సీఎం కేసీఆర్​ కూడా ఈ వాదనతో ఏకీభవించినట్లు తెలిసింది. అందుకే ఏ గ్రామానికీ అన్యాయం జరగని రీతిలో నిబంధనలు రూపొందిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాధారిత అధ్యయనం ద్వారా ప్రతిపాదనలు రూపొందిస్తే జలశయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, సాధారణ కార్యకలాపాలు కూడా సాగించవచ్చని అధికారులు సర్కార్​కు సూచించారు. ఈ ప్రతిపాదన నచ్చిన సర్కార్​ నిపుణులను రంగంలోకి దించి పూర్తిస్థాయి రిపోర్టు తయారీకి పురమాయించింది.

వర్షపు నీరు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై స్టడీ

రిపోర్టు తయారీలో భాగంగా నిపుణులు స్థానిక అధికారుల సహాయంతో జలాశయాలకు వర్షపు నీరు ఏ ప్రాంతం నుంచి వస్తుందో అధ్యయనం చేస్తున్నారు. 50 ఏండ్ల వర్షపాతాన్ని స్టడీ చేసి ప్రవాహ మార్గాన్ని శాటిలైట్​ మ్యాపుల ద్వారా గుర్తించనున్నారు. జలాశయాల ఎగువ నుంచి వచ్చే ఈ నీరు జీవో 111​ పరిధిలోని 84 గ్రామాల గుండా ఎట్లా ప్రవహిస్తోందో నిర్ధారిస్తారు. ఈ ప్రవాహ మార్గాన్ని గ్రీన్​ చానల్​గా గుర్తించి వరద కాలువలు నిర్మిస్తారు. కాలువల నిర్మాణం కోసం భూములు తీసుకోవాల్సి వస్తే మార్కెట్​ రేట్​ కట్టి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.  

చుక్క నీరు కూడా బయటకు రాకుండా..

రియల్​ ఎస్టేట్​ యాక్టివిటీ కోసం ఒక్కో ఊరిలోని కొంత ప్రాంతాన్ని గుర్తిస్తారు. కొంచెం తక్కువ వర్షపాతం ఉండి జలాశయాల మనుగడకు ఇబ్బంది కలిగించని ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతిస్తారు. ఈ ప్రాంతాల్లో విల్లాలు లేదా అపార్ట్​మెంట్లు వెలిసే అవకాశం ఉండడంతో జీరో లెవల్​ డిశ్చార్జి(జడ్​ఎల్డీ) షరతులకు అనుమతులు ఇస్తారు. అంటే ఈ నివాస ప్రాంతాల నుంచి చుక్క నీరు కూడా బయటకు రావొద్దు. వారు వాడే నీటిని రీసైకిల్​ చేసి అక్కడే వివిధ కార్యకలాపాలకు వాడుకోవాలి.ప్రస్తుతం నిర్మాణాలున్న గ్రామాల్లో జలాశయాలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా.. దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు అనుమతిస్తారు. నిర్మాణ అనుమతుల కోసం వసూలు చేసే ఫీజును 20 శాతం పెంచితే ఎట్లా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ప్రజలకు న్యాయం చేసేలా..

సీఎస్​ నేతృత్వంలోని కమిటీ ప్రత్యామ్నాయ నిబంధనల విషయంలో గట్టి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్​ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే 84 గ్రామాల ప్రజలు జీవో 111 కారణంగా వెనకబడిపోయారని, వారికి ఇంత కాలం జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందనే వాదనను తెర మీదకు తెస్తున్నట్లు తెలుస్తోంది. మురుగునీటి సమస్య పరిష్కరించేందుకు హుస్సేన్​సాగర్​కు పరిశ్రమల వ్యర్థాలను తరలించేలా ప్రత్యేక పైప్​లైన్​ వ్యవస్థ తరహా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ​సాగర్​లోకి వచ్చే వ్యర్థాలను ఎస్టీపీకి తరలించి శుద్ధి చేస్తారు. ప్రత్యేక ట్రంక్​ లైన్లనూ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.