అంగన్‌‌వాడీ కేంద్రాల్లో  పప్పు లేదు, పాలు లేవు

అంగన్‌‌వాడీ కేంద్రాల్లో  పప్పు లేదు, పాలు లేవు

ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆరో నంబర్ అంగన్​వాడీ సెంటర్. ఇక్కడ రోజూ 13 మంది గర్భిణులు, 8 మంది బాలింతలు, ఐదుగురు చిన్నారులకు పోషకాహారం అందించాల్సిఉంది. రెండు నెలలుగా కంది పప్పు, పాలు సప్లై కావడం లేదు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఓ ఆకుకూర.. లేదంటే టమాటా చారు, పచ్చిపులుసుతో సరిపెడ్తున్నారు. పచ్చిపులుసు పౌష్టికాహారం ఎలా అవుతుందని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

కామారెడ్డి/నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్​వాడీ సెంటర్లకు కందిపప్పు, పాల సరఫరా నిలిచిపోయింది. కొన్ని జిల్లాల్లో నెలరోజులుగా, ఇంకొన్ని జిల్లాల్లో రెండు నెలలుగా సరుకులు రావడం లేదు. కాంట్రాక్ట్ గడువు ముగియడంతో కంది పప్పు, పాల సప్లయ్‌‌ని ‘హాకా’ నిలిపేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మంచిర్యాల సహా పలు జిల్లాల్లో ఎగ్స్ సరఫరా నిలిచిపోయింది. స్నాక్స్, బాలామృతం కూడా అరకొరగానే అందిస్తున్నారు. సెంటర్లలో రెండు నెలలుగా కందిపప్పు, పాలు లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని అధికారులు అంటున్నారు. దీంతో చాలా సెంటర్లలో ఆకుకూర లేదంటే టమాటచారు, పచ్చిపులుసుతో భోజనం పెడ్తున్నారు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.

గిట్టుబాటు కావట్లేదని తప్పుకున్న ‘హాకా’

రాష్ట్రంలో 99 రూరల్​, 25 అర్బన్​, 25 ట్రైబల్​ ఐసీడీఎస్​ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్​వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలకు హాకా (హైదరాబాద్​ అగ్రికల్చర్​ కోఆపరేటివ్ అసోసియేషన్​) ద్వారా పాలు, కంది పప్పు సప్లై చేస్తున్నారు. టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా విజయ గ్రౌండ్ నట్ ఆయిల్, మరో సంస్థ ద్వారా బాలామృతం సరఫరా అవుతున్నది. కందిపప్పు, పాల సప్లయ్ కాంట్రాక్ట్‌‌ను రాష్ట్రస్థాయిలో హాకా తీసుకుంది. గత నెలలోనే కందిపప్పు కాంట్రాక్ట్​గడువు ముగిసింది. 

ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆరో నంబర్ అంగన్​వాడీ సెంటర్. ఇక్కడ రోజూ 13 మంది గర్భిణులు, 8 మంది బాలింతలు, ఐదుగురు చిన్నారులకు పోషకాహారం అందించాల్సి ఉంది. రెండు నెలలుగా కంది పప్పు, పాలు సప్లై కావడం లేదు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఓ ఆకుకూర.. లేదంటే టమాటా చారు, పచ్చిపులుసుతో సరిపెడ్తున్నారు. పచ్చిపులుసు పౌష్టికాహారం ఎలా అవుతుందని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

సర్కారు కిలోకు ఇచ్చే రేటు (రూ.111) గిట్టుబాటు కావడం లేదని హాకా తప్పుకున్నది. రేట్లను సవరించడమో, లేదంటే రీ టెండర్లు పిలవడమో చేస్తే తప్ప సమస్య పరిష్కారం అయ్యేలా లేదు. మరోవైపు పాలను కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ద్వారా హాకా సేకరిస్తున్నది. కానీ పశువులకు లంపిస్కిన్​వ్యాధి కారణంగా ఫెడరేషన్ నుంచి పాల సప్లై ఆగినట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో సెంటర్లకు సరుకులు నిలిచిపోయాయి.

మెనూ ఘనం.. అమలు ఘోరం..

అంగన్​వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం ఇవ్వాల్సి ఉంటుంది. గర్భం దాల్చిన వెంటనే మహిళ పేరును ఆ ఏరియా పరిధిలోని అంగన్​వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసుకోవాలి. అప్పటి నుంచి డెలివరీ అయిన 6 నెలల దాకా ఆరోగ్యలక్ష్మి స్కీం కింద రోజూ 150 గ్రాములు బియ్యం, 30 గ్రాముల కంది పప్పు, 16 గ్రాముల నూనె, 200 ఎంఎల్ పాలు, ఉడికించిన గుడ్డుతో సంపూర్ణ భోజనం అందించాలి. రోజూ అన్నంలో పప్పు, ఆకుకూర తప్పనిసరిగా ఉండాలి. 7 నెలల నుంచి మూడేండ్ల లోపు చిన్నారులకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 ఎగ్స్, 200 మిల్లీలీటర్ల పాలు.. 3 నుంచి 5 ఏండ్ల చిన్నారులకు రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనె, 20 గ్రాముల స్నాక్స్, రోజుకో గుడ్డు, ఆకుకూరలతో వండిన అన్నం పెట్టాలి. కానీ రెండు నెలలుగా కీలకమైన కందిపప్పు, పాల సప్లై నిలిచిపోయింది. మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్​కర్నూల్ జిల్లాల్లోని అంగన్​వాడీ సెంటర్లకూ రెండు నెలలుగా పాలు, కంది పప్పు సరఫరా జరగడం లేదు. ఏటూరునాగారం ఏజెన్సీ ఏరియాలో సప్లై కావడం లేదు. గర్భిణులకు, మూడు నెలల చిన్నారులకు ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉండగా.. రోజు తప్పించి రోజు ఇస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల్లోని వందలాది సెంటర్లకు ఈ నెల మొదటి వారంలో రావాల్సిన బియ్యం రాలేదు. దీంతో ఆయా చోట్ల భోజనం పెట్టడం బంద్ చేశారు. వనపర్తి జిల్లాలోని అంగన్​వాడీ కేంద్రాలకు నెలరోజులుగా కందిపప్పు, పాలు రావడం లేదు. ఈ నెల 5 నుంచి గుడ్లు సప్లై చేయడం లేదని అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు చెప్తున్నారు. వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాలకు మూడు నెలలుగా, మరికొన్ని మండలాలకు రెండు నెలలుగా పప్పు, పాలు రావడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో రెండు నెలల నుంచి కందిపప్పు, పాలు అందడం లేదని డీడబ్ల్యూవో నర్మద తెలిపారు.

కంది పప్పు స్టాక్ లేదు

అంగన్​వాడీ సెంటర్లకు కొద్దిరోజులుగా కంది పప్పు, పాలు సప్లై కావడం లేదు. కంది పప్పు స్టాక్​అయిపోవడంతో కూరగాయలతో భోజనం పెడ్తున్నాం. బియ్యం, నూనె, బాలామృతానికి ఎలాంటి ప్రాబ్లమ్​ లేదు. కంది పప్పు స్టాక్ లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి రాగానే వండిపెడ్తాం.
- శ్రీలత, సీడీపీవో, కామారెడ్డి

సరుకులు వస్తలేవంట

రోజూ అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్తున్నాం. ప్రభుత్వం గర్భిణులకు, బాలింతలకు అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారాన్ని ఇస్తామని చెబుతున్నది. కానీ ఇక్కడ సరుకులు రాకపోవడం వల్ల సరైన పౌష్టికాహారం అందట్లేదు. కేవలం పాలు, గుడ్లు మాత్రమే ఇస్తున్నారు.
- జ్యోతి, బాలింత, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్, గుడిహత్నూర్, ఆదిలాబాద్​