విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ : విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుల కోసం ఎదురుచూడకుండా ద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో స్వతహాగా చర్యలు తీసుకోవాలని మూడు రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు అధికారులను ఆదేశించింది. దేశంలో కొంతమంది చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 

రాష్ట్ర పరిధిలో ద్వేషపూరిత  ఘటనలపై తీసుకున్న చర్యలపై నివేదికలు దాఖలు చేయాలని మూడు రాష్ట్రాల పోలీసులను కోరింది. ఇలాంటి తరహా కేసుల విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైతే తప్పు చేసిన అధికారులపైనా కోర్టు ధిక్కారం కింద చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

దేశంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలను అరికట్టే విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ఈ తరహా కేసుల్లో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి నివేదికలు కోరింది.