ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేయండి.. సీసీటీవీలతో నిఘా పెంచండి.. సుప్రీంకోర్టు ఆదేశం

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేయండి.. సీసీటీవీలతో నిఘా పెంచండి.. సుప్రీంకోర్టు ఆదేశం

హర్యానాలో చెలరేగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ మద్దతుదారులు ఢిల్లీలో నిరసనలు చేపడుతుండటంపై అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి, సీసీటీవీలతో గట్టి నిఘా పెంచాలని సూచించింది. ఈ నిరసనల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హర్యానాలో హింస చెలరేగడంతో దేశ రాజధాని నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

హర్యానాలోని మేవాట్‌లో జరిగిన ఘర్షణలను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ శ్రేణులు ఢిల్లీలో పలు చోట్ల30 చోట్ల నిరసనలు చేపడుతున్నారు. హర్యానాలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. భారీగా ఆస్తినష్టం జరిగింది. 

ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ర్యాలీలపై స్టే విధించాలంటూ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నిరసనల్లో ఎలాంటి హింస, విద్వేష ప్రసంగాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకోసం పారామిలటరీ బలగాలతో సహా తగిన భద్రతా సిబ్బందిని మోహరించాలని సూచించింది. అంతేకాకుండా నిరసనలను రికార్డు చేసేలా తగినన్ని సీసీటీవీలు కూడా అమర్చాలని అధికారులను ఆదేశించింది.