
విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు సోమవారం (నవంబర్ 20న) కీలక వ్యాఖ్యలు చేసింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తీవ్రమైన పోటీ, వారి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడే ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు అని అభిప్రాయపడింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల ఆత్మహత్యలు అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది.
ఇవి తేలిక విషయాలు కాదు.. ఇటువంటి సంఘటనలన్నింటి వెనక విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడే కారణం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో కోర్టులు ఎలా ఆదేశాలు ఇస్తాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీ ధర్మాసనం చెప్పింది. కోచింగ్ సెంటర్లు ఉండకూడదని చాలామంది కోరుకుంటారని తెలిపింది. కానీ... పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే తీవ్ర ఒత్తిడి ఉంటోందని.. వేరే మార్గం లేకనే విద్యార్థులు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని గుర్తు చేసింది.
ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో దేశవ్యాప్తంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని.. లాభార్జనే ధ్యేయంగా వస్తోన్న వీటిని నియంత్రించాలని కోరుతూ ముంబయికి చెందిన అనిరుద్ధ నారాయణ్ మల్పానీ అనే డాక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున మోహినీ ప్రియా అనే న్యాయవాది వాదనలు వినిపించారు. దేశంలో దాదాపు 8.2శాతం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న ఎన్‌సీఆర్‌బీ-2020 నివేదికను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.