370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించడం చరిత్రాత్మకం : డా. మాడభూషి శ్రీధర్ ఆచార్యులు

 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించడం చరిత్రాత్మకం : డా. మాడభూషి శ్రీధర్ ఆచార్యులు

భారత ప్రధాన న్యాయమూర్తి  డీవై చంద్రచూడ్, సుప్రీం న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 11న చారిత్రాత్మక కీలక తీర్పును వెలువరించింది.  కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని  సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది, జమ్మూ కాశ్మీర్  రాష్ట్ర హోదాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ సందర్భంగా చీఫ్​ జస్టిస్​ ఆఫ్​ ఇండియా చంద్రచూడ్ మాట్లాడుతూ  పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 30 సెప్టెంబర్ 2024 నాటికి ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్​కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించడంతోపాటు. జమ్మూ కాశ్మీర్​ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని,  భారత రాజ్యాంగాన్ని వర్తింపజేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం లేదని పేర్కొంది. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సొలిసిటర్  జనరల్ 

సుప్రీంకోర్టుకు అందించిన సమాచారం ప్రకారం కేంద్రం వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించనుంది. జమ్మూ కాశ్మీర్​ కేంద్రపాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరణ చెల్లుబాటుపై న్యాయస్థానం తీర్పులో పేర్కొనలేదు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణయించడాన్ని రాజ్యాంగ 
ధర్మాసనం సమర్థించింది. 

సుప్రీంకోర్టు ముందు కీలక అంశాలు

జమ్మూ కాశ్మీర్​పై కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పలు కీలక అంశాలు నిలిచాయి. ఆర్టికల్ 370  నిబంధనలు తాత్కాలికమైనవా లేదా అవి శాశ్వత స్థితిని పొందాయా?, జమ్మూ కాశ్మీర్​ రాజ్యాంగ అసెంబ్లీని 'లెజిస్లేటివ్ అసెంబ్లీ'గా మార్చారు. ఆర్టికల్ 370(1)(డి) కింద అధికారాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆర్టికల్ 367కి సవరణ చేయడం, తద్వారా 'రాజ్యాంగ అసెంబ్లీ'ని 'శాసనసభ' ద్వారా ప్రత్యామ్నాయం చేయడం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా?,  ఆర్టికల్ 370(1)(డి) ప్రకారం  భారత రాజ్యాంగాన్ని  జమ్మూ కాశ్మీర్​కు వర్తింపజేయవచ్చా?,  రాజ్యాంగ నిబంధ
నల ప్రకారం జమ్మూ కాశ్మీర్​ రాజ్యాంగ సభ సిఫార్సు లేకపోవడంతో రాష్ట్రపతి ఆర్టికల్ 370ని రద్దు చేయడం చెల్లుబాటు కాదా?, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ చేసిన ప్రకటన రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా?,  డిసెంబర్ 2018లో విధించిన రాష్ట్రపతి పాలన ప్రకటన, తదుపరి పొడిగింపు చెల్లుబాటు అవుతుందా?, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్న జమ్మూ కాశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా?. ఆర్టికల్ 356 ప్రకారం ప్రకటన సమయంలో రాష్ట్ర శాసనసభ రద్దు చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్​లో పరిస్థితి,  దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం చెల్లుబాటు అయ్యే అధికారాన్ని కలిగి ఉందా?.. ఇలా పలు అంశాలపై వాదనలు, అనేక తీర్మానాల ఆధారంగా సుప్రీంకోర్టు తుది తీర్పు రూపొందింది.

రాష్ట్రపతి పాలన చెల్లుబాటు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ప్రకటించడంపై పిటిషనర్లు సవాలు చేయకపోవడంతో వాటి చెల్లుబాటుపై తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అక్టోబర్ 2019లో రాష్ట్రపతి పాలన ఉపసంహరింంచినందున ఎటువంటి మెటీరియల్ రిలీఫ్ ఇవ్వలేమని, రాష్ట్రపతి పాలన ప్రకటన అమలులో ఉన్నప్పుడు యూనియన్, రాష్ట్రాల అధికారంపై పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రం అధికార పరిధి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 356 ప్రకారం అధికారాన్ని ఉపయోగించడం అనేది సహేతుకంగా ఉండాలని,  రాష్ట్రాల తరఫున యూనియన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, రాష్ట్రపతి పాలనలో రాష్ట్రం తరపున యూనియన్ తీసుకున్న ప్రతి నిర్ణయం సవాలుకు వీలుపడదని, ఇది రాష్ట్ర పరిపాలన స్తంభింపజేస్తుంది అని పేర్కొంది. దీనిపై పిటిషనర్ల వాదనను ధర్మాసనం తిరస్కరించింది. రాష్ట్రపతి పాలనలో రాష్ట్రంలో తిరుగులేని అధికారాలతో చర్యలు తీసుకోలేరు. అంతేకాకుండా, రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడే పార్లమెంటు రాష్ట్ర చట్టాలను రూపొందించే అధికారాలను చేయగలదన్న పిటిషనర్ల వాదనను కూడా అంగీకరించలేదు. రాష్ర్టపతి పాలన  ప్రకటన తర్వాత రాష్ట్రపతి అధికారాన్ని ఉపయోగించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 356(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తరపున అధికారాలను వినియోగించుకునేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం చట్టాన్ని రూపొందించే అధికారాలకు మాత్రమే పరిమితం కాలేదని నిర్ధారించింది. 

ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో..ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధనగా పరిగణించబడిందని సీజేఐ చంద్రచూడ్​ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 (3) ప్రకారం ఆర్టికల్ 370 ఉనికిలో లేదని, నోటిఫికేషన్ జారీ చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారం జమ్మూ కాశ్మీర్​ రాజ్యాంగ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కూడా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. జమ్మూకాశ్మీర్​ రాజ్యాంగ సభ తాత్కాలిక సంస్థగా ఉద్దేశించబడింది అని పేర్కొంది. ఆర్టికల్ 370(1)(డి) ద్వారా భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జమ్మూ కాశ్మీర్​కు వర్తింపజేయాల్సిన అవసరం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్​ పేర్కొన్నారు-. ఆర్టికల్ 370(1)(డి)ని ఉపయోగించి భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జమ్మూ కాశ్మీర్​కు వర్తింపజేయవచ్చు. దానికి కొనసాగింపుగా రాష్ట్రపతి అధికార చెల్లుబాటు అవుతుందని నిర్ధారించబడింది. రాష్ట్రపతి అధికారాన్ని వినియోగించుకోవడానికి సంప్రదింపులు అవసరం లేదని, ఆర్టికల్ 370(1)(డి)ని ఉపయోగించి రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను  వర్తింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

సెప్టెంబర్​ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు

ఆర్టికల్ 370  రద్దు ఉద్దేశ్యం జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా తీసుకురావడం అని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో  పేర్కొంది. ఆర్టికల్ 370(1)(డి) ప్రకారం అధికారాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆర్టికల్ 370ని సవరించలేమని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో సీజేఐ చంద్రచూడ్​ అభిప్రాయంతో ఏకీభవిస్తూ జస్టిస్ ఎస్​కే కౌల్​ ఆర్టికల్​367 ఉపయోగించి ఆర్టికల్ 370  సవరణకు సంబంధించి ఒక విధానాన్ని సూచించినప్పుడు దానిని అనుసరించాలని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్​ రాష్ట్ర హోదా  రిస్టోరేషన్​,  జమ్మూ కాశ్మీర్​కు కేంద్ర పాలిత ప్రాంత హోదా కూడా టెంపరరీ అని సొలిసిటర్​ జనరల్​ వివరించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 3 రాష్ట్రంలోని కొంత భాగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి అనుమతించడంతో లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించడాన్ని ధర్మాసనం సమర్థించింది.  ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మాకంగా పేర్కొనవచ్చు.

ఆర్టికల్​ 370...సార్వభౌమాధికారం కాదు

జమ్మూ కాశ్మీర్‌కు సార్వభౌమాధికారం ఉందని రాజ్యాంగ వ్యవస్థ సూచించడం లేదని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో.. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో సార్వభౌమాధికార ప్రస్తావన స్పష్టంగా లేదని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగంగా మారిందని రాజ్యాంగంలోని ఆర్టికల్​1, ఆర్టికల్​ 370 అధికరణల ద్వారా ఇది స్పష్టంగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు వేర్వేరు స్థాయిలలో ఉన్నప్పటికీ శాసన, కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉన్నాయని చీఫ్​ జస్టిస్​ ఆఫ్​ ఇండియా చంద్రచూడ్​ తెలిపారు. ఆర్టికల్ 371ఎ నుంచి 371జె వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక ఏర్పాట్లకు ఉదాహరణలు.  ఆర్టికల్ 370 అసమాన ఫెడరలిజం లక్షణమని, సార్వభౌమాధి కారం కాదని పేర్కొంది. 

-డా. మాడభూషి శ్రీధర్ ఆచార్యులు, స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్, సలహాదారు, మహీంద్రా యూనివర్సిటీ