తలాక్-ఇ-హసన్ సరైనదే

తలాక్-ఇ-హసన్ సరైనదే

న్యూఢిల్లీ : ముస్లింల్లో విడాకులకు సంబంధించిన తలాక్‌‌‌‌–ఇ–హసన్‌‌‌‌ తప్పేమీ కాదని, ఇది సరైనదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తలాక్‌‌‌‌–ఇ–హసన్.. త్రిపుల్​ తలాక్​ లాంటిది కాదని పేర్కొంది. మహిళలు కూడా ఖులా ద్వారా విడాకులు పొందే వీలుందని తెలిపింది. తలాక్–ఇ–హసన్ అంటే.. నెలకోసారి చొప్పున 3 నెలల పాటు వరుసగా తలాక్ చెప్పి భార్య నుంచి విడాకులు పొందవచ్చు. దీనిపై యూపీకి చెందిన ఓ ముస్లిం మహిళ పిటిషన్​ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ కేఎస్ కౌల్, జస్టిస్ ఎంఎం సుంద్రేష్​లతో కూడిన బెంచ్​ మంగళవారం ఈ పిటిషన్​పై విచారణ జరిపింది. 

ఇది త్రిపుల్​ తలాక్​ కాదు..
ఇస్లాం ప్రకారం.. మగవాళ్లు తలాక్​ ద్వారా, ఆడవాళ్లు ఖులా ద్వారా తమ భాగస్వామి నుంచి విడాకులు పొందవచ్చని, భార్యాభర్తలు కలిసి జీవించలేకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తాము విడాకులు మంజూరు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. “ఇది త్రిపుల్ తలాక్ కాదు. వివాహం ఒప్పంద స్వభావంతో ఉంటుంది. మహిళలకు ఖులా కూడా ఉంది. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించలేని పక్షంలో మేం విడాకులు మంజూరు చేస్తున్నాం” అని బెంచ్​ స్పష్టం చేసింది. ‘ముబారత్’ ద్వారా కోర్టు ప్రమేయంలేకుండా వివాహాన్ని రద్దు చేయడం సాధ్యమవుతుందని పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.