
ఢిల్లీ : సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నడుస్తోంది. గవర్నర్ తమిళి సై బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గవర్నర్ కు నోటీసు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రానికి నోటీసులు ఇస్తామని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి (మార్చి 27వ తేదీకి) వాయిదా వేసింది న్యాయస్థానం.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ తమిళి సై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టారని సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్ తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా ఈ పిటిషన్ వేశారు.
పిటిషన్‌లో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు. శాసనసభ, శాసనమండలి బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపితే మొత్తం పది బిల్లులకు రాజ్‌భవన్ ఆమోదం తెలుపలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్‌భవన్ తీరువల్ల ప్రజా ప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకొన్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని 194 పేజీల పిటిషన్‌లో తెలిపారు.