మణిపూర్‌లో శాంతిభద్రతలు లేవు.. యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది : సుప్రీంకోర్టు

మణిపూర్‌లో శాంతిభద్రతలు లేవు.. యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది : సుప్రీంకోర్టు

ఢిల్లీ : మణిపూర్ మహిళలను వివస్త్రలను చేసిన ఊరేగించిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తు నత్తనడకన సాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆరు వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే కేవలం ఏడుగురిని అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించింది. మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవని.. అక్కడి రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించింది. కేసులు దర్యాప్తు చేసే సామర్థ్యం మణిపూర్ పోలీసులకు లేదని పేర్కొంది. వీటిపై పూర్తి వివరాలతో రాష్ట్ర డీజీపీ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ ఆగస్టు 7వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

మణిపూర్ ఘటనలపై మంగళవారం (ఆగస్టు 1వ తేదీన) వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పోలీసుల తీరుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మణిపూర్ రాష్ట్ర పోలీసులు నియంత్రణ కోల్పోయారని, వారికి దర్యాప్తు చేసే సామర్థ్యం లేదని వ్యాఖ్యానించింది. మణిపూర్ లో శాంతిభద్రతలు లేవని... ఒకవేళ శాంతిభద్రతల యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించకపోతే ప్రజలకు ఏం ప్రయోజనం..? అని ప్రశ్నించింది.

సాయుధ మూకలకు మహిళలను అప్పగించిన వారిని (పోలీసులను) రాష్ట్ర పోలీసులు ప్రశ్నించారా..? అని పేర్కొంది. గడిచిన రెండు నెలలుగా అక్కడ శాంతిభద్రతలు, రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని చెప్పింది. దర్యాప్తు కూడా చాలా నెమ్మదిగా సాగుతోందని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.

ఎఫ్‌ఐఆర్‌లలో ఎంతమంది నిందితులు ఉన్నారు..? వారి అరెస్టు విషయంలో తీసుకున్న చర్యలు ఏంటి..? అనే విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. మణిపూర్ ఘటనలకు సంబంధించి దాఖలైన విజ్ఞప్తులపై విచారణ జరుపుతామని.. రాష్ట్ర డీజీపీ వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది. మరోవైపు భారీ స్థాయిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ప్రస్తావిస్తూ.. దర్యాప్తునకు మౌలిక వసతులు ఏమేరకు ఉన్నాయని సీబీఐని కూడా సుప్రీంకోర్టు అడిగింది.