స్వలింగ సంపర్కుల వివాహాలు సరైనవేనా..? నేడు (అక్టోబర్​ 17న) సుప్రీంకోర్టు తీర్పు

స్వలింగ సంపర్కుల వివాహాలు సరైనవేనా..? నేడు (అక్టోబర్​ 17న) సుప్రీంకోర్టు తీర్పు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం (అక్టోబర్​ 17న) సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్‌ 18న ఈ అంశంపై విచారణ ప్రారంభించింది.

10 రోజులపాటు వాదోపవాదాలను విన్న తర్వాత మే 11వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. దీనిపై కేంద్రం కూడా తమ వాదనలు వినిపించింది. స్వలింగ పెండ్లిండ్లకు చట్టబద్ధత కల్పించడం సరైన చర్య కాదని వాదనలు వినిపించింది. 

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ కల్పించాలనే దానిపై సుప్రీంతీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం (అక్టోబర్​ 17న) తీర్పును వెలువరించనుంది. 

ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం వివాహం అనే పదాన్ని పురుషులు, స్త్రీ అని కాకుండా జీవిత భాగస్వామి మధ్య అని చదవాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును పిటిషన్ లో కోరారు. ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు అంశానికే పరిమితమవుతామని, వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన అంశాల జోలికి వెళ్లబోమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది. 

స్వలింగ సంపర్క జంటలకు చట్టబద్ధత కల్పించే అంశంలోకి వెళ్లకుండా, వారి ఆందోళనలను పరిష్కరించడం కోసం కొన్ని చర్యలను అన్వేషించడానికి కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మే 3న సుప్రీంకోర్టుకు తెలిపింది.

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను కొట్టేసిన ఐదేళ్ల తర్వాత మనదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.