
- పార్టీలు బ్రాహ్మణులను మరిచినయ్
- జనాభా దామాషా ప్రకారం తమకు సీట్లు కేటాయించాలి
- తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు : బ్రాహ్మణులను అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని, జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన సీట్లను కేటాయించాలని తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక కన్వీనర్ జమలపురం శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. తాను ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానని, మహేశ్వరం టికెట్ తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 8 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నా, ఆయా పార్టీలు తమను జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే చూస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో బ్రాహ్మణులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 లక్షల మంది బ్రాహ్మణులు నివసిస్తున్నారని తెలిపారు. సమాజ హితం కోరుకునే బ్రాహ్మణ సామజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. సమావేశంలో కో -కన్వీనర్లు చంద్రమోహన్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.